డీటీ..పోటీ!
ఫోకల్ పోస్టులకు భలే గిరాకీ
డిప్యూటీ తహసీల్దార్లుగా 14 మందికి పదోన్నతి
మంచి స్థానం కోసం పలువురి ప్రయత్నాలు
తమకూ ప్రాధాన్యం ఇవ్వాలంటున్న ఎన్నికల డీటీలు
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల భర్తీ ఉన్నతాధికారులకు ప్రహసనంగా మారింది. ఇటీవల సీనియర్ అసిస్టెంట్ల నుంచి పదోన్నతి పొందిన 14 మంది పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. మరో వైపు 12 మంది ఎన్నికల డీటీలు తమకు ఎన్నికల సంఘం కొనసాగింపు లేనందున రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరువర్గాల్లో ఎక్కువ మంది తమకు ఫోకల్ పోస్టులు కావాలని తమ వంతు ప్రయాత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు అధికారులను నేరుగా కలిసి విన్నపాలు ఇవ్వగా.... మరికొందరు తెరవెనుక నుంచి ప్రయత్నిస్తున్నారు. అందరికీ పోస్టులు ఇవ్వాలంటే మొత్తం 26 డీటీ స్థానాలు అవసరం ఉంటుంది. ఈ విషయంలో ఏంచేయాలన్న దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.
ఎన్నికల డీటీలకు వేతనాలు బంద్
జిల్లాలోని 12 నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల డీటీలు ఎన్నికల సమయంలో విధుల్లో చేరారు. సహజంగా వీరికి ఎన్నికల సంఘం నిబంధనలు, నిర్ణయం ప్రకారం పోస్టింగ్‌లు ఇస్తారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం డీటీలను కొనసాగించే విషయంలో తదుపరి ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో డిసెంబర్ నెల వరకే వీరికి వేతనాలు అందాయి. జనవరి సంబంధించిన వేతనం ఫిబ్రవరిలో రావాల్సి ఉండగా.... ఖజానా అధికారులు నిబంధనలు చూపి జీతాలు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆ డీటీలంతా తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. పనిలో పనిగా కలెక్టర్, జేసీలను కలిసి పరిస్థితిని వివరించేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సంఘం నుంచి తదుపరి సూచనలు వచ్చినా... రాకున్నా తమను ఎన్నికల విభాగం నుంచి రెగ్యులర్ విభాగానికి మార్చాలని కోరుతున్నారు. ఎన్నికల సమయంలో ఇతర పోస్టులు ఖాళీ ఉన్నా...్న అవసరం దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాలప్రకారం విధులు నిర్వర్తించామని, ప్రస్తుతం అవకాశం ఉన్నందున తమను ఇతర పోస్టుల్లోకి మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల డీటీల పరిస్థితి ఇలా ఉంటే... ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతి ఫైల్‌కు అధికారులు ఇటీవలే మోక్షం కల్పించారు. దీంతో 14మంది సీనియర్ అసిస్టెంట్లు డీటీలుగా పదోన్నతి పొందారు. ఈ మేరకు వారు మంచి పోస్టుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో అధికారులపై ఒత్తిళ్లు పెరిగినట్లు సమాచారం.
ప్రత్యేక కలెక్టర్ వద్ద కొత్త ఖాళీలు
ప్రస్తుతం జిల్లాలో డీటీ పోస్టులో 14 ఖాళీలు ఉన్నాయి. వీటికితోడు ప్రభుత్వం నూతనంగా కంతనపల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ కార్యాలయానికి 4 డీటీ, 4 సీనియర్ అసిస్టెంట్, ఒక లా అధికారితోపాటు ఇతర ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను కేటారుుంచింది. ప్రత్యేక కలెక్టర్‌గా డేవిడ్‌ను ప్రభుత్వం నియమించినప్పటికీ... మిగతా పోస్టుల భర్తీ విషయంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కంతనపల్లి ప్రత్యేక కలెక్టర్ కార్యాలయూన్ని మాత్రం చింతగట్టులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఓ కొలిక్కి వస్తే మరో నలుగురు డీటీలు, సీనియర్ అసిస్టెంట్లు, ఒక తహసీల్దార్ అక్కడ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ఉన్న మొత్తం ఖాళీలను కొత్తవారితో నింపితే.. కీలక పోస్టుల్లో పరిపాలనా సమస్యలు కూడా వస్తాయని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో అన్ని బేరీజు వేసుకుని ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్లలో కూడా కొందరికి స్థానచలనం కల్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.
సమావేశమైన ఎన్నికల డీటీలు
డిప్యూటీ తహసీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో ఏర్పడ్డ పోటీతో ఎన్నికల డీటీలు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నా రు. ఈ విషయంలో తమకు ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నతాధికారులకు సమస్యను వివరించాలని అభిప్రాయపడ్డారు. అందు కు సంఘం నాయకులు సైతం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మొత్తంగా డీటీల పోస్టింగ్‌ల విషయం ప్రసుత్తం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది.