desai tippareddy
-
పెళ్లి సందడి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: మదనపల్లె శాసనసభ్యులు డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఇంట ఆయన కుమార్తె పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. అంగళ్లు గోల్డెన్ వ్యాలీ ప్రాంగణం లో శనివారం రాత్రి జరిగిన వివాహ వేడుక కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్.జగన్మోహన్రెడ్డి, పలువురు శాసనసభ్యులు హాజరై నూతన వధూవరులు డాక్టర్ కరిష్మాదేశాయ్, లక్ష్మీకాంతరెడ్డిలను ఆశీర్వదించారు. పులివెందుల నుంచి నేరుగా మదనపల్లి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముందుగా పట్టణంలోని పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షమీమ్ అస్లాం ఇంటికెళ్లి వారి కొడుకు, కోడలికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి నేరుగా అంగళ్లులోని దేశాయ్ వారి వివాహ ప్రాంగణానికి చేరుకుని కొత్త జంటను అభినందించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, పార్టీ నాయకులు వైఎస్ జగన్‌ను కలిసేందుకు ఆసక్తి చూపారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, చెవి రెడ్డి భాస్కర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి, పీలేరు, పూతలపట్టు, రైల్వే కోడూరు, నర్సరావుపేట శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, సునీల్‌కుమార్, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చిత్తూరు, సత్యవేడు, పలమనేరు, తంబళ్లపల్లి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జులు జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, రెడ్డెమ్మ, సీవీ కుమార్, రాకేశ్‌రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఉన్నారు. -
'ఎన్నికలు జరిగితే బాబుకు డిపాజిట్లూ రావు'
పుంగనూరు(చిత్తూరు జిల్లా): ‘‘ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ గల్లంతు కావడం ఖాయం. వైఎస్సాఆర్సీపీదే అధికారం. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి. మేం ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తాం. పార్టీని వదిలి మునిగిపోయే నావలోకి వెళ్లం’’ అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునిల్‌కుమార్ స్పష్టంచేశారు. పుంగనూరు మండలం వేపమాకులపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన పల్లె బాట కార్యక్రమంలో ఈ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్న నూతన రాజధాని పేరుతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తెలంగాణలో ప్రజలు టీడీపీని భూ స్థాపితం చేశారని, అలాగే ఆంధ్రలోనూ ఆ పార్టీ కనుమరుగవుతుందన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి వస్తుందని చెప్పారు. చంద్రబాబునాయుడుకు అధికార దాహం ఎక్కువని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. అధికారం కోసం ఆయన మామకే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల పేరుతో రూ.600 కోట్లు, పట్టిసీమ పేరుతో రూ.1300 కోట్లు, రాజధాని పేరుతో వేలకోట్లు స్వాహా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునిల్‌కుమార్ మాట్లాడుతూ దళిత కుటుంబంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అంటూ దళితులను అవమానపరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సిగ్గులేకుండా దళిత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాము వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో చివరిదాక పనిచేస్తామని, తెలుగుదేశం కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.