'ఎన్నికలు జరిగితే బాబుకు డిపాజిట్లూ రావు'
పుంగనూరు(చిత్తూరు జిల్లా): ‘‘ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ గల్లంతు కావడం ఖాయం. వైఎస్సాఆర్‌సీపీదే అధికారం. కాబోయే ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి. మేం ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తాం. పార్టీని వదిలి మునిగిపోయే నావలోకి వెళ్లం’’ అంటూ చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ సునిల్‌కుమార్ స్పష్టంచేశారు. పుంగనూరు మండలం వేపమాకులపల్లెలో ఆదివారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేపట్టిన పల్లె బాట కార్యక్రమంలో ఈ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తోందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో నిర్మిస్తున్న నూతన రాజధాని పేరుతో దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవన్నారు.
తెలంగాణలో ప్రజలు టీడీపీని భూ స్థాపితం చేశారని, అలాగే ఆంధ్రలోనూ ఆ పార్టీ కనుమరుగవుతుందన్నారు. 2019లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి వస్తుందని చెప్పారు. చంద్రబాబునాయుడుకు అధికార దాహం ఎక్కువని పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. అధికారం కోసం ఆయన మామకే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాల పేరుతో రూ.600 కోట్లు, పట్టిసీమ పేరుతో రూ.1300 కోట్లు, రాజధాని పేరుతో వేలకోట్లు స్వాహా చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ సునిల్‌కుమార్ మాట్లాడుతూ దళిత కుటుంబంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా.. అంటూ దళితులను అవమానపరచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సిగ్గులేకుండా దళిత ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. తాము వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో చివరిదాక పనిచేస్తామని, తెలుగుదేశం కుట్రలకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.