అటు నుంచి 40 మంది రారని గ్యారంటీ ఉందా?
హైదరాబాద్ సనత్ నగర్ నియోజకవర్గం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నో నీతులు చెప్పారని.. ఇప్పుడు ఆయన ఏపీలో చేస్తున్నది ఏంటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి విమర్శించారు. 10 మందిని తీసుకెళ్తా అని చెప్పిన చంద్రబాబు కేవలం నలుగురిని మాత్రమే చేర్చుకోగలిగారని, దీంతో ఆయన ఏంటన్నది అందరికీ తెలిసిపోయిందని అన్నారు. తమ పార్టీ వాళ్లు నలుగురు ఆ పార్టీలోకి వెళితే టీడీపీ నుంచి 40 మంది తమ పార్టీలోకి రారని గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఓ మాట, ఇక్కడ ఓ మాట మాట్లాడుతున్నారన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మాట్లాడినట్లే ఇక్కడ కూడా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సవాలు చేశారు. తమకు మెజార్టీ ఉన్నా అక్రమంగా జిల్లా పరిషత్ లను కైవసం చేసుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చి బాబు సీఎం అయ్యారని, ఇప్పుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. అక్కడ కేసీఆర్ చేశారు. ఇక్కడ నేను చేస్తాను అంటే నీ నైతికత ఏంటి చంద్రబాబూ అని పెద్దిరెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలన్నారు. టీడీపీ నుంచి వెళ్లి పోయిన తర్వాత రాజీనామా చేసి ఓసారి, టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు రెండుసార్లు రాజీనామా చేసి ఎన్నికలల్లో పోటీచేసి గెలిచారన్నారు. టీడీపీలో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి.. దమ్ముంటే ఎన్నికల్లో మళ్లీ గెలిచి చూపించాలని డిమాండ్ చేశారు. నైతికత లేని నేత ఎవరంటే ఒక్క చంద్రబాబు తప్ప ఎవరూ లేరని, ప్రజలు ఇదే విశ్వసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రెండేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశావు బాబూ.. రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ లో ఉండి పాలించావు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు.
తనపై ఓటుకు కోట్లు కేసులు వేశారని వాపోయిన చంద్రబాబు.. ఇప్పుడు కేసీఆర్ తో ఏమైనా సెటిల్ మెంట్ చేసుకున్నారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అర్హత కోల్పోతున్నామా అని అడిగారు. నిజంగానే చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఈ మూడేళ్లే కాదు.. మరో 5 ఏళ్లు రాష్ట్రాన్ని మీ చేతుల్లోనే పెడతామని చెప్పారు. కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రజలు రెండేళ్లు మిమ్మల్ని భరించారని, ఇంకా ఆయన పరిపాలన కొనసాగితే ఇంకెన్ని దుష్పరిణామాలు తలెత్తుతాయోనన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎవరో పార్టీ నుంచి వెళ్లిపోయారని దాని గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు.