కార్పొరేట్ వారసులకూకోట్లలో వేతనాలు
బాధ్యతలు అప్పగించగానే ప్యాకేజీలు
న్యూఢిల్లీ: వస్తూ వస్తూనే కోటీశ్వరుల క్లబ్లో చేరిపోతున్నారు ప్రముఖ వ్యాపారవేత్తల వారసులు. అంబానీల నుంచి అదానీల వరకు, ప్రేమ్‌జీ నుంచి ఖొరాకివాలా వరకు దేశంలో కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ఇతర వ్యాపార సంస్థల్లో చేరిన తదుపరి తరం నాయకులు వేతనాలు, పారితోషికాల రూపంలో అప్పుడే కరోడ్‌పతి క్లబ్లో చేరిపోయారు. చాలా మంది తమ కుమారులు, కుమార్తెలను తమ వారసులుగా కీలక బాధ్యతల్లోకి తీసుకొస్తున్నారు. కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వారికి మంచి ప్యాకేజీలనే ఫిక్స్ చేసేస్తున్నారు.
అదానీ వారసుడికి రూ.కోటిన్నర
⇔ అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ కుమారుడు కరణ్... అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ సీఈవోగా నియమితులయ్యారు. 2015-16లో ఎలాంటి వేతనాన్నీ అందుకోలేదు. అయితే, వేతనం, ఇతర పారితోషికాలు, ప్రయోజనాల రూపంలో కరణ్‌కు రూ.1.5 కోట్లను ఈ సెప్టెంబర్ 1 నుంచి చెల్లించేందుకు బోర్డ్ ఆమోదం తెలిపింది.
అనుమోల్ అంబానీకి రూ.1.2 కోట్లు
⇔ అనిల్ అంబానీ కుమారుడు జై అనుమోల్ అంబానీ (24) ఇటీవలే గ్రూపు కంపెనీ రిలయన్స్ కేపిటల్లో డెరైక్టర్‌గా చేరిపోయారు. ఆయనకు నెలకు రూ.10 లక్షల చొప్పున వేతనాన్ని చెల్లించేందుకు కంపెనీ ప్రతిపాదించింది. వేతనానికి అదనంగా అలవెన్స్‌లు, కమీషన్లు, ఇతర ప్రతిఫలాలు కూడా అందించేందుకు బోర్డు సుముఖత చూపింది.
ముకేశ్ వారసుల సంగతో...?
⇔ దేశీయ సంపన్నుడిగా వెలుగుతున్న ముకేశ్ అంబానీ వారసులు గ్రూపు కంపెనీల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. కుమార్తె ఇషా, ఆకాష్ జియో వెనుకనున్న విషయం తెలిసిందే. అయితే, వీరి వేతనాల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
టీవీఎస్ వారసుడికి రూ.10 కోట్లు
⇔ టీవీఎస్ మోటార్స్ ఎండీ వేణు శ్రీనివాసన్ కుమారుడు సుదర్శన్ వేణు జాయింట్ ఎండీగా గత ఆర్థిక సంవత్సరానికి రూ.9.59 కోట్లు అందుకున్నారు.
ఇతర వారసుల వేతనాలు
⇔ ఐటీ కంపెనీ విప్రో చైర్మన్ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్, ఈడీగా ఉన్నారు. 2015-16లో ఆయన వేతనం రూ.2.15కోట్లు.
⇔ ఫార్మా కంపెనీ వోకార్డ్ చైర్మన్ హబిల్ ఖొరాకివాలా వేతనం 1.32 కోట్లు. కంపెనీలో ఈడీ, ఎం డీలుగా ఉన్న ఆయన కుమారులు హుజైఫా, ముర్తజాల వేతనం రూ.1.32 కోట్ల చొప్పున ఉంది.
⇔ మరో ఫార్మా కంపెనీ సిప్లా చైర్మన్ వైకే హమీద్ మేనకోడలు సమీనా వజిరల్లి 2015-16లో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా రూ.2.47 కోట్ల వేతనాన్ని తీసుకున్నారు. అయితే, ఆమె ఈ నెల 1 నుంచి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ప్రమోట్ అయ్యారు.
⇔ డీఎల్ఎఫ్ చైర్మన్ కేపీసింగ్ కుమారుడు రాజీవ్ సింగ్ కంపెనీ వైస్ చైర్మన్‌గా తీసుకున్న వేతనం రూ.4.42 కోట్లు.