వ్యాపారానికి అనువైన దేశంగా భారత్
- మరింత ఆమోదయోగ్యమైన పన్నుల విధానం
- మా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశాలు ఇవే...
- పీటీఐ ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: ఆమోదయోగ్యమైన పన్నుల విధానం, వ్యాపారానికి మరింత అనువైన పరిస్థితులను కల్పించడమే రాబోయే రోజుల్లో తమ ప్రభుత్వం ముందున్న అత్యంత ప్రాధాన్య అంశాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. మోదీ సర్కారు ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
నిర్ణయాల్లో జాప్యాలను తొలగించడం, సంస్కరణల వేగాన్ని కొనసాగించడంపైన కూడా దృష్టిసారించనున్నట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాము చేపడుతున్న సంస్కరణలు వాస్తవ రూపం దాల్చడం లేదంటూ వస్తున్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. ప్రభుత్వం చెబుతున్న మాటలు... చేతల్లో కనబడటం లేదంటూ కార్పొరేట్ ఇండియా నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి అడిగిన ప్రశ్నకు జైట్లీ స్పందిస్తూ... అలాంటి ధోరణికి తావులేదని స్పష్టం చేశారు.
గతేడాది మేలో అధికారం చేపట్టిన తమ ప్రభుత్వం పన్నులకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకుందన్నారు. ‘వస్తు, సేవల పన్ను(జీఎస్టీ)ని వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశాం. అదేవిధంగా నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును ఇప్పుడున్న 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించేలా నిర్ణయం తీసుకున్నాం. దీనిలో భాగంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు మినహాయింపులను కొనసాగిస్తూనే, కంపెనీలకు వీటిని తొలగించడంపై దృష్టిపెడుతున్నాం. డిమాండ్‌ను పెంచడానికి, వృద్ధికి చేయూతనిచ్చేందుకు ఇవి దోహదం చేస్తాయి’ అని జైట్లీ వివరించారు.
అంతిమంగా స్థిరమైన, సబబైన పన్నుల విధానమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. ప్రైవేటు పెట్టుబడుల పెంపు, ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం కోసం అనుమతుల జారీ ప్రక్రియను మెరుగుపరుస్తున్నామని, జీఎస్టీ, భూసేకరణ చట్టం వంటి పెండింగ్ బిల్లుకు ఆమోదం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టుల నుంచి కంపెనీలు సులువుగా వైదొలగేందుకు దివాలా(బ్యాంక్రప్సీ) కోడ్‌ను కూడా తీసుకురావడంపై దృష్టిపెట్టామన్నారు.
యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు...
‘వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు భారీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నాం. ఇది నిరంతర ప్రక్రియ. గత యూపీఏ ప్రభుత్వం ప్రధానంగా ప్రజాకర్షక పాలసీలు, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని వ్యవస్థను తప్పుదోవ పట్టించింది. ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియ విశ్వసనీయత కోల్పోయాల చేసింది. సరళీకరణను పక్కనబెట్టి క్రోనీయిజమ్(సన్నిహితులను అనుకూలంగా నిర్ణయా లు తీసుకోవడం)ను కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది.
స్పెక్ట్రం, బొగ్గు వంటి కుంభకోణాలే దీనికి నిదర్శనం’ అని జైట్లీ పేర్కొన్నారు. తమ మోదీ సర్కారు మాత్రం ఇలాంటివాటికి దూరంగా ఆర్థిక సరళీకరణను పరుగులు పెట్టిస్తోందన్నారు. ఏడాది పాలనలో తమ సర్కారుపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. స్థూల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
వృద్ధి రేటు పుంజుకుంటోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుందన్న పూర్తి విశ్వాసం ఉంది. అయితే, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మందగమనం, ఈ ఏడాది రుతుపవనాలపై నెలకొన్న ఆందోళనలు దేశీ ఆర్థిక వ్యవస్థకు సవాలుగా మారనున్నాయని జైట్లీ అభిప్రాయపడ్డారు.