ప్రాజెక్టుల రీడిజైన్‌తో తెలంగాణ సస్యశ్యామలం
కాంగ్రెస్ హయాంలోనే ప్రాజెక్టు పేరుతో దోపిడీ
భట్టి వ్యాఖ్యలపై బాలసాని, కొండబాల ధ్వజం
ఖమ్మం వైరారోడ్ : తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకే సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి నిర్మాణం చేపడుతున్నారని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం స్థానిక టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం దోపిడీ చేస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పదేళ్లపాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. ఇందిరాసాగర్–రాజీవ్‌సాగర్ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి, పనులు చేయకుండానే రూ.3 వేల కోట్లను పంచుకుతిన్నారని ఆరోపించారు. పదేళ్ల కాలంలో ఒక్క ఎకరానికి కూడా నీరందించకుండా నేడు దీక్షలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో 150 పైగా లిఫ్ట్‌లు మూలనపడ్డాయని, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ వాటన్నింటికీ మరమ్మతులు చేసి అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. సొంత నియోజకవర్గంలోని జాలిముడి ప్రాజెక్టును పూర్తి చేయించలేని భట్టికి ప్రభుత్వాని విమర్శించే హక్కు లేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ నాయకులు తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని వారు హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు కమర్తపు మురళి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, మందడపు సుధాకర్, మాటేటి నాగేశ్వరరావు, తిరుమలరావు పాల్గొన్నారు.