‘కారుణ్యం’ కరువాయె..!
ఖమ్మం జడ్పీ సెంటర్: జిల్లాలో కారుణ్య నియామకాల జాడ కనపించటం లేదు. అనేక మంది అర్హులైన అభ్యర్థులు ఉన్నా పోస్టుల భర్తీకి అధికారులు ఆసక్తి చూపటం లేదు. డ్యూటీలో ఉండి చనిపోయిన వారి పిల్లలకు రోస్టర్, విద్యార్హత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అధికారులు మాత్రం.. ఈ పోస్టుల భర్తీపై శ్రద్ధపెట్టడం లేదు. ఇప్పటికే పలువురి ఉద్యోగ విరమణతో పలు శాఖల్లో పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటిని కారుణ్య నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తే.. ఇప్పటికే విధుల్లో ఉన్న ఉద్యోగులకు పదోన్నతి లభించదనే కారణంతోనే ఖాళీల వివరాలను ఆయా శాఖల అధికారులు గోప్యంగా ఉంచుతున్నార నే ఆరోపణలు ఉన్నాయి.
కలెక్టర్‌కు కూడా వీటి విషయం తెలపడం లేదని తెలుస్తోంది. జిల్లా పరిషత్ ఆధీనంలోని పంచాయతీరాజ్‌శాఖలో సుమారు 50 వరకు కారుణ్య నియామక దరఖాస్తులు ఉన్నాయని సమాచారం. ఈ ఒక్క శాఖలోనే ఇన్ని దరఖాస్తులు ఉంటే జిల్లావ్యాప్తంగా అన్ని శాఖల్లో ఇంకెన్ని ఉంటాయో ఊహించుకోవచ్చు. కలెక్టరేట్లో కారణ్య నియామకాల కోసం వంద మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు.
ఆందోళనలో అభ్యర్థులు
కారుణ్య నియామకాలకు అర్హులైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. గతంలో ఒకసారి కారుణ్య నియామకాలు చేపట్టారు. ఆయా శాఖల అధికారులు సరైన వివరాలు ఇవ్వకపోవడంతో ఈ నియామకాలు పూర్తిస్థాయిలో జరుగలేదు. సకాలంలో ఉద్యోగం రాక పోవడంతో కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన వారు ఇబ్బంది పడుతున్నారు. ఆర్థిక, మానసిక వేదనకు లోనవుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం.. కారుణ్య నియామక అభ్యర్థులు, వారి కుటుంబీకులకు శాపంగా మారింది. ఉద్యోగం లేకపోవడంతో తమ కుటుంబాలు వీధినపడుతున్నాయని, రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు శాఖల నుంచి ఖాళీల వివరాలు అందకపోవడం వల్లే పోస్టులను భర్తీ చేయలేకపోతున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నారని అభ్యర్థులు వాపోతున్నారు.
ఖాళీ పోస్టులను అనేక సంవత్సరాలుగా కారుణ్య నియామకాల ద్వారా భర్తీచేసే బాధ్యతను కలెక్టరేట్లోని రెవెన్యూ అధికారులు నిర్వర్తించేవారు. ఏ శాఖలో ఖాళీలను ఆ శాఖలో నింపేవారు. ఇటీవలికాలంలో ఆ బాధ్యతను కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. నాటి నుంచి పలు శాఖల పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యమవుతోంది. కొన్ని శాఖల అధికారులకే ఆయా శాఖల్లో ఖాళీలను భర్తీ చేయడానికి, పదోన్నతులు కల్పించడానికి వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనేకమంది అభ్యర్థులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
కలెక్టర్ ఆదేశించినా చలనం లేదు
కారణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను కలెక్టరేట్‌కు పంపించాలని, ఆయాశాఖల్లో ఖాళీల వివరాలను అందజేయాలని కలెక్టర్ ఆదేశించినా అధికారులు మాత్రం స్పందించటం లేదు. గత కలెక్టర్ శ్రీనివాసశ్రీనరేశ్ సైతం ఖాళీల నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. మూడు నాలుగు నెలలు గడుస్తున్నా అధికారులు ఖాళీలను ఇవ్వకపోగా ఎలాంటి పోస్టులను భర్తీ చేయడం లేదు. వివిధ శాఖలకు సంబంధించి అనేక ఏళ్ళుగా దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ఆ శాఖల ఖాళీల వివరాలు లేకపోవటం వల్ల సుమారు 100కి పైగా అర్హులు పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.
కలెక్టర్ స్పందిస్తేనే వెలుగులు..
జిల్లా కలెక్టర్ కారుణ్య నియామకాలపై దృష్టిసారిస్తేనే పెద్ద దిక్కుకోల్పోయిన వందల కుటుంబాల్లో వెలుగులు వస్తాయి. ప్రభుత్వ శాఖల్లోని అనేక మంది ఉద్యోగులు వివిధ కారణాల వల్ల మృతిచెందడంతో పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. వారసత్వంగా అర్హులకు ప్రభుత్వం వెంటనే పొస్టింగ్‌లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. కానీ జిల్లాలో అనేకేళ్లుగా ఈపోస్టుల పై జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారించక పోవటంతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాల్లో వెలుగులు నింపాలంటే కలెక్టర్ స్పందించాల్సిందేనని పలువురంటున్నారు.