హెచ్‌యూఎల్ లాభం 872 కోట్లు
ముంబై: ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) జనవరి-మార్చి(క్యూ4) కాలంలో రూ. 872 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో ఆర్జించిన రూ. 787 కోట్లతో పోలిస్తే ఇది 11% అధికం. ఇదే కాలానికి అమ్మకాలు కూడా 9% ఎగసి రూ. 6,936 కోట్లకు చేరాయి. గతంలో రూ. 6,367 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. స్టాండెలోన్ ఫలితాలివి. వాటాదారులకు షేరుకి రూ. 7.50 చొప్పున తుది డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ కాలంలో మొత్తం వ్యయాలు రూ. 5,555 కోట్ల నుంచి రూ. 6,082 కోట్లకు పెరిగాయి. సమస్యాత్మక వాతావరణంలోనూ పోటీతో కూడిన లాభదాయక వృద్ధిని సాధించగలిగామని కంపెనీ చైర్మన్ హరీష్ మన్వని వ్యాఖ్యానించారు.
సబ్బుల అమ్మకాల జోరు
క్యూ4లో సబ్బులు, డిటర్జెంట్ల అమ్మకాలు దాదాపు 10% పుంజుకుని రూ. 3,497 కోట్లను తాకగా, వ్యక్తిగత ఉత్పత్తుల విభాగం ఆదాయం 8%పైగా పెరిగి రూ. 1,983 కోట్లయ్యింది. ఇక బెవరేజెస్ విభాగం నుంచి 7.5% అధికంగా రూ. 869 కోట్ల ఆదాయం సమకూరగా, ప్యాకేజ్డ్ ఫుడ్ అమ్మకాలు దాదాపు 13% వృద్ధితో రూ. 420 కోట్లకు చేరాయి. 9% ఎగసిన దేశీ క న్జూమర్ బిజినెస్ కారణంగా మార్కెట్లను మించుతూ పటిష్ట పనితీరును చూపగలిగామని కంపెనీ సీఎఫ్‌వో ఆర్.శ్రీధర్ పేర్కొన్నారు. వరుసగా 8వ క్వార్టర్లోనూ డిమాండ్ మందగించినట్లు తెలిపారు. కాగా, బ్రాండ్లు, కొత్త ఉత్పత్తులపై పెట్టుబడులు పెంచినట్లు మన్వని చెప్పారు. వ్యయాల అదుపుతోపాటు, కార్యకలాపాల మెరుగుకు తీవ్రంగా కృషి చేసినట్లు తెలిపారు. తద్వారా దీర్ఘకాలంపాటు వృద్ధిని నిలుపుకోవడమేకాకుండా, మార్జిన్లను పెంచుకోగలమన్న ధీమాను వ్యక్తం చేశారు.
పూర్తి ఏడాదికి
గడిచిన ఆర్థిక సంవత్సరం(2013-14)లో హెచ్‌యూఎల్ నికర లాభం రూ. 3,839 కోట్ల నుంచి రూ. 3,955 కోట్లకు పెరిగింది. మొత్తం అమ్మకాలు కూడా రూ. 26,317 కోట్ల నుంచి రూ. 28,539 కోట్లకు ఎగ శాయి. ఇది దాదాపు 9% వృద్ధి. ఇకపై కూడా పరిశ్రమ సగటును మించి వృద్ధిని సాధించగలమని భావిస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు. డవ్, లక్స్ వంటి సబ్బుల అమ్మకాల ద్వారా మార్జిన్లు 30 బేసిస్ పాయింట్లు బలపడ్డాయని పేర్కొన్నారు. వీటితోపాటు చర్మ రక్షణ, ఆహార, పానీయాల విభాగాలు సైతం పుంజుకున్నట్లు తెలిపారు. పానీయాల విభాగంలో తాజ్ మహల్, రెడ్ లేబుల్, 3రోజెస్, బ్రూ గోల్డ్, ప్యాకేజ్డ్ ఫుడ్స్‌లో కిసాన్, క్వాలిటీ వాల్స్, మాగ్నమ్, లాండ్రీ విభాగంలో సర్ఫ్, రిన్ వంటి బ్రాండ్లు అమ్మకాల వృద్ధికి దోహదపడినట్లు శ్రీధర్ పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో హెచ్‌యూఎల్ షేరు యథాతథంగా రూ. 581 వద్ద ముగిసింది.