గుట్టుగా లింగ నిర్ధారణ!
సాక్షి, అచ్చంపేట రూరల్: మహిళలు పురుషులతో సమానంగా అన్నింటా ముందుంటున్న రోజులివి.. చదువు, ఉద్యోగం, వ్యాపార రంగాల్లోనూ వారిదే అగ్రస్థానం.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్న తరుణంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు గుట్టుగా సాగిపోతున్నాయి. ఆడ శిశువు భూమి మీద పడగానే కొందరు మొగ్గ దశలోనే తుంచేస్తుండగా.. మరికొందరు కడుపులోనే చిదిమేస్తున్నారు.. ఇలాంటివే అచ్చంపేటలోనూ చోటుచేసుకుంటున్నాయి.. కానీ ఈ విషయం గురించి పట్టించుకొనే నాథుడే కరువయ్యారు.. ఈ క్రమంలో ఆడపిల్లల కోసం ఎన్ని చట్టాలు వస్తున్నా.. అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా నీరుగారిపోతున్నాయి..
అనుమతి ఒకరిది.. నిర్వహణ?
అచ్చంపేట ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. గతంలో కొన్నింటికి అనుమతి ఇవ్వగా రెన్యువల్ చేసుకోకుండా అవే పాత మిషన్లతో స్కానింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టుగా లింగ నిర్ధారణ చేస్తూ డబ్బులను దండుకుంటున్నారు. అనర్హులు సైతం స్కానింగ్ సెంటర్లను నిర్వహిస్తున్నారు. ఒకరి పేరు మీద అనుమతి తీసుకుని మరొకరు నిర్వహిస్తున్నారు. ఇదంతా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆస్పత్రిలోనే స్కానింగ్ సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తే ఇలా జరగడానికి వీలుండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తనిఖీల జాడేదీ?
జిల్లాస్థాయి అధికారులు మొదట్లో అక్కడక్కడ తనిఖీలు చేసి హల్చల్ చేసి పోతారు. పెద్దగా పేరులేని స్కానింగ్ సెంటర్లు, ప్రైవేటు ఆస్పత్రులను సీజ్ చేసి తమ పని అయిపోయిందన్నట్లు ఊరుకుంటున్నారు. అసలు దొంగలను మాత్రం విడిచి పెడుతున్నారు. వారు అప్పుడప్పుడు అమ్యామ్యాలు పంపిస్తారని బహిరంగంగానే చర్చ జరుగుతుంది. ఫిర్యాదులు అందితే తప్ప తనిఖీ చేయరని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నోసార్లు ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులపై రాత పూర్వకంగా ఫిర్యాదు అందించినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు.
చట్టాలు ఏం చెబుతున్నాయి..
సుప్రీంకోర్టు 2001లో పీసీ, పీఎన్డీటీ యాక్టు కింద లింగ నిర్ధారణ నేరమని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. పీసీపీఅండ్డీటీ యాక్టు 1994, రూల్స్ 1996 ప్రకారం ఆస్పత్రుల్లో జిల్లా వైద్యాధికారి అనుమతితో ఆల్ట్రాస్కానింగ్ యంత్రాలను ఉపయోగించాలి. అయినప్పటికీ ప్రైవేటు క్లీనిక్‌లు నిబంధనలు పాటించడం లేదు. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహిస్తూ ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. అచ్చంపేటలో రోజురోజుకు పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఆస్పత్రులు ఇదే తీరును కనబరుస్తున్నాయి. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు.
స్కానింగ్ సెంటర్ సీజ్
అచ్చంపేటలోని లింగాల రోడ్డుకు సమీపంలో ఉన్న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో గత కొన్నేళ్లుగా స్కానింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. 2012లో స్కానింగ్ సెంటర్ నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకోగా 2017 వరకు అనుమతి ఇచ్చారు. 2017లో మళ్లీ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోగా అప్పటి అధికారులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఈ సెంటర్లో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని అధికారుల దృష్టిలో ఉండటంతో తిరస్కరించారు. నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని గతంలో 2014 అక్టోబర్ 4న శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు. అయినప్పటికీ అప్పటి నుంచి మళ్లీ యథేచ్ఛగా స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. స్కానింగ్‌ను సోనాలజిస్టు, రేడియాలజిస్టు, గైనిక్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. కాగా ఈ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ వైద్యురాలు బుచ్చమ్మ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం జిల్లా వైద్యాధికారులు ఆకస్మికంగా దాడి చేసి స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేశారు.
స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి
అచ్చంపేట రూరల్: నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి లేకుండా నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి దశరథ్ అన్నారు. మంగళవారం అచ్చంపేట సివిల్ కోర్టులో జడ్జి ముందు నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా నిర్వహిస్తున్న అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రి గురించి లాయర్ ద్వారా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిపారు. సెక్షన్–18 ఆర్/23 ఆఫ్ పీసీ అండ్ పీఎన్డీటీ కేసు నమోదు చేశామన్నారు. నల్లమల ప్రాంతంలో అనుమతి లేని స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని, లింగ నిర్ధారణ చేస్తే కఠినంగా శిక్షలు పడేలా చేస్తామని హెచ్చరించారు.
చర్యలు తీసుకుంటాం
జిల్లాలో అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. అచ్చంపేటలోని శ్రీరాం (సర్రాం) ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్‌ను అనుమతి లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని తెలుసుకుని కలెక్టర్ అనుమతితో సీజ్ చేశాం. అలాగే జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి వాటిపై చర్యలు తీసుకుంటాం. - దశరథ్, జిల్లా వైద్యాధికారి, నాగర్‌కర్నూల్