రైళ్లకు బాంబులతో సిగ్నళ్లు
తుపాను ప్రభావంతో ఒక్కసారిగా పెరిగిపోయిన పొగమంచు
సిగ్నళ్లు కనిపించక డ్రైవర్ల ఆందోళన
డిటోనేటర్ సిగ్నలింగ్‌కు అనుమతించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని వణికిస్తున్న తుపానులు రైళ్లకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎర్ర లైటో.. పచ్చలైటో చూసుకుని ముందుకెళ్లే పరిస్థితి లేక.. ఏకంగా డిటోనేటర్లు పేల్చాల్సిన పరిస్థితి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైలు మార్గాల్లో ట్రాక్మెన్లు ‘డిటొనేటర్లు’ పట్టుకుని తిరుగుతున్నారు. అంతేకాదు.. కచ్చితంగా అన్ని రైల్వేస్టేషన్ల పరిధిలో డిటోనేటర్లు నిల్వ చేసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలూ వచ్చాయి. తుపానులు, అల్పపీడనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పొగ మంచు తీవ్రత పెరగటమే దీనంతటికీ కారణం. తెల్లవారుజామున, ఉదయం, సాయంత్రాల్లో పొగ మంచు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రైలు డ్రైవర్లకు సిగ్నళ్లు కనిపించవు. ఇది ఒక్కోసారి ఘోర ప్రమాదాలకు కారణమవుతుంది. అలాంటి సందర్భాల్లో సిగ్నళ్లపై లోకోపైలట్లను అప్రమత్తం చేసేందుకు రైల్వే సిబ్బంది డిటోనేటర్లను పేల్చుతారు. దాంతో లోకో పైలట్లు అప్రమత్తమై రైలు వేగాన్ని బాగా తగ్గించి, సిగ్నల్‌ను నిశితంగా పరిశీలించి ముందుకు సాగుతారు. సాధారణంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితికి అవకాశం తక్కువ. చలి తీవ్రత బాగా పెరిగిన ప్పుడు ఏజెన్సీల్లాంటి ప్రాంతాల్లో పొగమంచు కనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం వరుసగా తుఫానులు, అల్పపీడనాల ప్రభావంతో పొగమంచు బాగా పెరిగింది. లోకో పైలట్లు ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆగమేఘాలమీద డిటొనేటర్లను సమకూర్చే పనిలో పడ్డారు.
డిటొనేటర్లు ఎందుకు?: పొగమంచు దట్టంగా ఉన్నప్పు డు లోకోపైలట్లు సిగ్నళ్లను గమనించగలిగేందుకు తోడ్పడే పరికరాలు మన రైల్వే వద్ద లేవు. దాంతో ప్రత్యేకంగా రూపొందించిన డిటొనేటర్లను రైలు వచ్చే సమయంలో సిగ్నళ్లకు కొన్ని వందల మీటర్ల ముందు పట్టాలపై అమరుస్తారు. రైలు దానిమీదుగా వెళ్లగానే అది పేలుతుంది. వెంటనే లోకోపైలట్ అప్రమత్తమై ముందు సిగ్నల్ ఉందని గుర్తించగలుగుతారు. వెంటనే రైలు వేగాన్ని కనిష్టస్థాయికి తగ్గించి, సిగ్నల్‌ను మసకగానైనా పరిశీలించి, తగిన చర్యలు చేపడతారు. సాధారణంగా చలి తీవ్రంగా ఉన్నప్పుడు రైలుపట్టాలు సంకోచిస్తాయి. ఒక్కోసారి విరిగిపోయి, ప్రమాదానికి కారణమవుతాయి. ట్రాక్‌మెన్ ద్వారా అధికారులు లోపాలను గుర్తించి, సిగ్నళ్లద్వారా లోకోపైలట్లను అప్రమత్తం చేస్తుంటారు. కానీ, పొగమంచుతో సిగ్నల్ కనిపించకపోతే ప్రమాదాలకు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏదైనా రైలు పట్టాలు తప్పటం వల్లనో, మరే కారణం చేతనో నిలిచిపోతే... వెనుక వస్తున్న ఇతర రైళ్లను ఎక్కడికక్కడ సిగ్నళ్ల ద్వారా నియంత్రించాల్సి ఉంటుంది. పొగమంచుకు సిగ్నల్ కనిపించకపోతే రైళ్లు ఢీకొనే ప్రమాదముంటుంది. కాగా.. ఉత్తర భారత ప్రాంతంలోని రైళ్లకు పొగమంచును చీల్చుకుంటూ కూడా ప్రసరించగలిగే సామర్థ్యమున్న లైట్లను అమర్చుతున్నారు. కానీ, దక్షిణమధ్య రైల్వేలో అలాంటివి లేవు. వాటిని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా అమలు కాలేదు. దాంతో ఇంకా డిటొనేటర్ సిగ్నళ్లపై ఆధారపడాల్సి వస్తోంది.