డబ్బుల్లేవ్..!
దేవరకొండ మండలం శాఖవల్లి గ్రామం నుంచి దళితులైన ఏడుగురు లబ్ధిదారులకు
భూ పంపిణీ చేయాలనుకున్నారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు పట్టాదారుల నుంచి
14.35 ఎకరాలు సేకరించారు. భూమి కొనుగోలుకు రూ.46.11 లక్షలుS కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు రాలేదు. డబ్బులు విడుదలై భూములు రిజిస్ట్రేషన్ చేద్దామనుకునే సమయానికి పట్టాదారులు తన భూములను మరొకరికి అమ్మేశారు. దీంతో మళ్లీ భూముల కోసం అధికారులు అన్వేషించాల్సి వస్తోంది. జిల్లావ్యాప్తంగా దళితుల భూపంపిణీ పథకం తీరు ఇది.
నల్లగొండ :
భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు ఉచితంగా మూడెకరాల భూ పంపిణీ చేయాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. 2016– 17కు గాను ఉమ్మడి నల్లగొండ జిల్లాకు 747 ఎకరాలు కొనుగోలు చేసి 249 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికి గాను బడ్జెట్లో జిల్లాకు రూ.37.35 కోట్లు కేటాయించారు. దీంట్లో 85 మంది లబ్ధిదారులకు 225.18 ఎకరాలకుగాను మంజూరీ ఇచ్చారు. నిబంధనల మేరకు భూములు అమ్మేందుకు ముందుకు వచ్చిన యజమానుల నుంచి హామీ తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 48 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేశారు. మిగిలిన 37 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో భూ పంపిణీ కార్యక్రమం ఆగిపోయింది. భూ యజమానులకు చెల్లించాల్సిన రూ.4.82 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదలైతే గానీ లబ్ధిదారులకు భూములు పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. నిధుల విడుదలలో జాప్యమవు తుండటంతో భూ యజమానులు మరొకరికి భూములు అమ్మేసుకుంటున్నారు. మొదట్లో భూపంపిణీకి అవసరమయ్యే నిధులు కలెక్టర్ ఖాతాలోనే ఉంచేవారు. ఆ తర్వాత కలెక్టర్ ఖా తాల నుంచి నిధులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి జిల్లా నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ వస్తోంది.
ప్రహసనంగా మారిన భూ పంపిణీ
భూ పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో పెద్ద ప్రహసనంగా మారింది. లబ్ధిదారులు ఎంపిక చేయడం దగ్గరి నుంచి భూములు కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయడం వరకు అధికారులు ముప్పుతిప్పలు పడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరుతో భూ పంచాయితీలు తార స్థాయికి చేరాయి. గడిచిన రెండు వార్షిక ప్రణాళికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,214 ఎకరాలు సేకరించి 738 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీనికిగాను రెండేళ్లలో కేవలం 215 మంది లబ్ధిదారులకు 514.15 ఎకరాలు మాత్రమే పంపిణీ చేయగలిగారు. దీంట్లో 15 మందికి 34.6 ఎకరాల ప్రభుత్వ భూ మి పంపిణీ చేయగా, మిగిలిన 480 ఎకరాలు ప్రైవేట్ పట్టాదారుల నుంచి కొనుగోలు చేసిందే.
కొన్ని మండలాల్లో పరిశీలిస్తే...
తిప్పర్తి మండలం రాజాపేటలో ఇద్దరు లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించారు. అదే గ్రామానికి చెందిన ఒక పట్టేదారు నుంచి ఆరు ఎకరాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. భూములు రిజిస్ట్రేషన్ చేద్దామనుకునే సమయానికి ఆ పట్టాదారుకు బ్యాంకులో రుణ బకాయి ఉన్నట్లు తేలింది. దీంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది.
మోత్కూరు మండలం గట్టుసింగారంలో ఇద్దరు లబ్ధిదారులకు మూడెకరాలు పంపిణీ చేద్దామనుకున్నారు. దీనికి ముగ్గురు పట్టాదారుల నుంచి 3.35 ఎకరాలు సేకరించారు. ఒక పట్టాదారు ఆకస్మికంగా చనిపోవడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. రెండు ఎకరాలు ఉన్న పట్టాదారు భూమి స్వార్జితం కాదని ప్రభుత్వ భూమి అని రిజిస్ట్రేషన్ ఆఫీసులో బయటపడింది. పట్టాదారులు పాస్ పుస్తకాలు కలిగి ఉండటంతో సొంత ఆస్తిగా భావించిన అధికారులు రిజిస్ట్రేషన్‌కు సిద్ధపడ్డారు.
నిడమనూరు మండలం గోపాలపురంలో ఇద్దరు లబ్ధిదారులకు మూడెకరాల చొప్పున భూమి పంపిణీ చేయాలనుకున్నారు. దీంట్లో ఒకరికి ప్రభుత్వ భూమి, మరొకరికి ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు చేసిన భూమి ఇవ్వాలని నిర్ణయించారు. ఇద్దరు లబ్ధిదారులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు కావడంతో భూముల విషయంలో వివాదం చోటుచేసుకుంది. ప్రై వేటు పట్టాదారు భూమి అధికార పార్టీకి చెందిన వ్యక్తికి ఇవ్వా లని, ప్రభుత్వ భూమి ప్రతిప క్ష పార్టీకి చెందిన వ్యక్తికి ఇవ్వాలని అధికారుల పై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో భూ వివాదం ప్రస్తుతం జిల్లా మంత్రి పరిశీలనలో ఉంది. దీని పై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది.