23నుంచి విశాఖలో దేవ్‌ధర్ ట్రోఫీ
విశాఖపట్నం,న్యూస్‌లైన్: దేవ్‌ధర్ ట్రోఫీ క్రికెట్ టోర్నీకి విశాఖ వేదిక కాబోతోంది. విశాఖలోని వైఎస్సార్ స్టేడియంలో ఈనెల 23 నుంచి ఈ పరిమిత ఓవర్ల అంతర జోనల్ నాకౌట్ టోర్నీ ప్రారంభం కానుంది. ట్రోఫీలో పాల్గొనేందుకు గురువారం ఈస్ట్‌జోన్ జట్టు విశాఖ చేరుకోగా మిగిలిన జట్లు రానున్న రెండు రోజుల్లో రాబోతున్నాయి. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో డే నైట్‌గా సాగే ఈ టోర్నీలో దేశంలోని ఐదు జోన్ల జట్లు తలపడనున్నాయి.
21న సెంట్రల్‌జోన్, సౌత్‌జోన్ జట్లు, 22న నార్త్‌జోన్ జట్టు, 23న వెస్ట్‌జోన్ జట్టు విశాఖ చేరుకోనున్నాయి. 23న జరిగే తొలి మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ జట్టుతో ఈస్ట్ జోన్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు 25వ తేదీన వెస్ట్‌జోన్‌తో తలపడనుంది. 24న సౌత్‌జోన్‌తో నార్త్‌జోన్ తలపడనుంది. 26న విశ్రాంతి దినంగా ప్రకటించగా ఫైనల్ పోరు 27న జరగనుంది. మ్యాచ్‌లు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నాయి. 22న ఉదయం తొమ్మిది గంటలకు ఈస్ట్‌జోన్, సెంట్రల్ జోన్ జట్లు వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయనుండగా మధ్యాహ్నం రెండు గంటలనుంచి నార్జోన్, సౌత్‌జోన్ జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి.
హర్భజన్, పుజారా సారథులు
దేవ్‌ధర్ ట్రోఫీలో తలపడే నార్త్‌జోన్ జట్టుకు హర్బజన్ నాయకత్వం వహించనుండగా టెస్ట్ క్రికెట్లో రాణించిన చటేశ్వర్ పుజారా వెస్ట్‌జోన్‌కు సారథిగా వ్యవహరించనున్నాడు. సెంట్రల్ జోన్లో శలభ్ శ్రీవాస్తవ, ఉమేష్, ఉర్వేష్ జట్టులో స్థానం సాధించారు. ఈస్ట్‌జోన్‌కు వర్ధమాన్ సాహా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో అబూ నెచిమ్, ప్రీతమ్ దాస్, బసంత్, ఇషాంక్ జగ్గీ, మహ్మద్ షమీ, షాబాజ్ నదీమ్ ఆడనున్నారు.