పీసీపల్లికి మహర్దశ
సంసాద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద ఎంపిక
ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దుతా
– ఎంపీ వైవీ సుబ్బారెడ్డి హామీ
పీసీపల్లి: మండలంలోని పీసీపల్లి పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పీసీపల్లిలో శుక్రవారం రాత్రి పల్లె నిద్ర చేసిన ఎంపీ శనివారం ఉదయం జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం జాయింట్ కలెక్టర్2 ప్రకాష్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత పీసీపల్లి పంచాయతీని దత్తత తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం పంచాయతీ పరిధిలో ఉన్న 11 గ్రామాల్లో పర్యటించి ప్రధాన సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు.
ప్రధాన సమస్యల గుర్తింపు
పంచాయతీలోని ప్రధానంగా తాగునీరు, అంతర్గత రోడ్లు, మురుగు కాల్వలు, మరుగుదొడ్లు, పాఠశాలలకు ప్రహరీలు లేకపోవడం, మురుగు నీరు రోడ్లుపైనే ఉండటం, పింఛన్లు నిలిపివేత తదితర సమస్యలు ప్రధానంగా పంచాయతీలో నెలకొని ఉన్నట్లు గుర్తించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఫ్లోరైడ్ సమస్యను అదిగమించేందుకు ఏర్పాటు చేసిన రామతీర్థం జలాలు గత ఏడాదిగా పేదలకు అందడంలేదని పలువురు ఎంపీ దృష్టికి తెచ్చారు. తొలుత జిల్లా స్థాయి అధికారులు రాలేదని ఏఈపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి సమస్యలు నువ్వు పరిష్కరిస్తావా అంటూ ప్రశ్నించారు.
ఫోరైడ్ రహిత గ్రామాలుగా మారుస్తా
ఎంపీ గ్రాంట్‌తో జిల్లా మొత్తం 80 వాటర్ ప్లాంట్లు మంజూరు కాగా, అందులో 56 కనిగిరి నియోజకవర్గానికే కేటాయించినట్లు తెలిపారు. ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడకుండా కాపాడేందుకే ఇవి నిర్మిస్తున్నానన్నారు. ఫోరైడ్ రహిత గ్రామాలుగా మారుస్తానన్నారు. జిల్లా స్థాయి అధికారులు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, వైద్యం, విద్య, పారిశుధ్యం కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఆక్రమణలో ఉన్న చెరువులను వెంటనే సర్వే చేసి ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలన్నారు. పీసీపల్లి పంచాయతీ కార్యాలయం శి«థిలావస్తకు చేరిందని, వెంటనే కొత్త భవనానికి ప్రపోజల్ పంపాలన్నారు. అంగన్ వాడీలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలో మొత్తం 37 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అందులో 11 పాఠశాలలకు ప్రహరీ సౌకర్యం లేదని, ఒక్కో పాఠశాలలకు రూ.16 లక్షలు మంజూరయ్యాయని, త్వరలో నిర్మాణం చేపట్టనున్నట్లు ఎస్ఎస్ఏ అధికారి తెలిపారు. పాలేటిపల్లి రిజర్వాయర్ నుంచి పీసీపల్లి, కమ్మవారిపల్లి చెరువులకు సప్లై ఛానల్‌కు ప్రపోజల్ పంపాలని ఆదేశించారు. పీసీపల్లి పంచాయతీలో అర్హులైన వారి పింఛన్లు తీసివేశారని, విచారించి వారికి అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎంపీ ఆదేశించారు. ఈకార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు డ్వామా పీడీ పోలప్ప, హౌసింగ్ పీడీ ధనుంజయులు, ఎస్సీ కార్పొరేషన్ అధికారి విజయలక్ష్మి, జడ్పీ సీఈవో బాపిరెడ్డి, ఆర్డీవో మల్లిఖార్జున రావు, వెటర్నరీ ఏడీ రజనీ కుమారి, డీపీవో ప్రసాద్ రాజు, డీఎఫ్‌వో, తహసీల్దార్ మౌలా సాహెబ్, ఎంపీడీవో సురేష్ బాబు, ప్రజాప్రతినిధులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూధన్ యాదవ్, జడ్పీటీసీ సభ్యురాలు కొండ్రు రాణెమ్మ, ఎంపీపీ బత్తుల అంజయ్య, సర్పంచి దేవండ్ల సుమ, ఎంపీటీసీ సబ్యులు కాకర్ల సుబ్బమ్మ, వైస్ సర్పంచి ఎలిది తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.