కంపెనీ మీది.. నిపుణులు మా వాళ్లు!
• డెవలపర్లను అద్దెకిస్తున్న డెవలపర్-ఆన్-రెంట్
• అన్ని రంగాలు, అన్ని టెక్నాలజీల్లోనూ సేవలందించడమే ప్రత్యేకత
• మన దేశంతో పాటూ కెనడా, యూఎస్, యూకెల్లోనూ సేవలు
• 2 నెలల్లో 4-6 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
• ‘స్టార్టప్ డైరీ’తో డెవలపర్-ఆన్-రెంట్ ఫౌండర్ క పిల్ మెహతా
హెదరాబాద్, బిజినెస్ బ్యూరో : ముంబైకి చెందిన పేమెంట్ గేట్‌వే కంపెనీ ఆటమ్ టెక్నాలజీస్‌కు ఓ రోజు వెబ్, మొబిలిటీ సొల్యూషన్స్‌లో ఇబ్బంది ఎదురైంది. వెంటనే క్లిక్ చేసి నిపుణున్ని అద్దెకు తీసుకుంది.
కాలిఫోర్నియాకు చెందిన స్లాటర్ కన్సల్టింగ్‌కు యాంగ్లర్ జేఎస్, మాజెంటో టెక్నాలజీలో సమస్య. సొల్యూషన్ కోసం చూస్తుంటే.. డెవలపర్ రెంట్కొచ్చేశాడు.
కెనడాకు చెందిన సెంతిక్... సీఎంఎస్, క్రోన్ వర్షన్లో ఇబ్బంది మొదలైంది. అది కూడా నిపుణున్ని అద్దెకు తీసుకోవటంతో పరిష్కారం కనుగొంది.
...ఇలా మన దేశంలోనే కాదు అమెరికా, కెనడా, యూకే, గల్ఫ్ వంటి 7 దేశాల్లోని కంపెనీలకు బెంగళూరు కేంద్రంగా పరిష్కారం చూపిస్తోంది ‘డెవలపర్-ఆన్-రెంట్’!!
సొంతంగా డెవలపర్లను నియమించుకొని కంపెనీలకు టెక్నాలజీలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే ఈ సంస్థ పని. రూ.10 లక్షల పెట్టుబడితో 2014 జనవరిలో ప్రారంభమైన డెవలపర్-ఆన్-రెంట్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ కపిల్ మెహతా మాటల్లోనే..
‘‘ఈ-కామర్స్ కంపెనీ ప్రారంభించాలంటే ముందుగా వెబ్సైట్ డిజైన్, టెక్నాలజీ డెవలప్మెంట్ కావాలి. వీటి కోసం డెవలపర్ వద్దకెళితే ఎవరి ధర వారిదే. కొందరేమో కొటేషన్ ఇచ్చి వెళ్లండి తయారు చేసి పంపిస్తామంటారు. ఇంకొందరేమో కస్టమర్ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోరు. ఇలా ఒక్కో డెవలపర్‌ది ఒక్కో ధోరణి. అలాకాకుండా కంపెనీతో పాటే డెవలపర్నూ అద్దెకు తీసుకుంటే!! కంపెనీకి అవసరమైనట్లుగా దగ్గరుండి చేయించుకొని ఆ తర్వాత డెవలపర్‌కు అద్దె ఇస్తే పోలే... అనిపించింది. దీంతో డెవలపర్‌కూ డబ్బులొస్తాయి. కస్టమర్ తనకేం కావాలో అదే దగ్గరుండి అందుబాటు ధరల్లో చేయించుకుంటాడు. అలా అనుభవం నుంచి పుట్టిందే డెవలపర్-ఆన్-రెంట్’’ అని సంస్థ ప్రారంభం గురించి వివరించారు కపిల్.
డెవలపర్, కస్టమర్ ఇద్దరికీ లాభమే..
డెవలపర్‌ను అద్దెకు తీసుకోవటం వల్ల డెవలపర్‌కు, కస్టమర్‌కు ఇద్దరికీ లాభం ఉంటుంది. అదెలాగంటే.. ఒక్కో డెవలపర్ ఏడాదిలో 6-8 మంది కస్టమర్లతో పనిచేస్తాడు. వివిధ టెక్నాలజీ, బిజినెస్ మాడ్యూల్స్ మీద పనిచేయాల్సి ఉంటుంది. దీంతో డెవలపర్‌కు అన్ని రకాల టెక్నాలజీ, వ్యాపార విధానాల మీద పూర్తి స్థాయి పట్టు వస్తుంది. కస్టమర్ లాభం విషయానికొస్తే.. ఆయా కంపెనీలకు అప్లికేషన్, టెక్నాలజీ డెవలప్మెంట్ కోసం పూర్తి స్థాయి డెవలపర్‌ను నియమించుకోవాల్సిన అవసరం ఉండదు. కారు, బైకు అద్దెకు తీసుకున్నట్టే పనికి తగ్గ డెవలపర్‌ను అద్దెకు తీసుకుంటే సరిపోతుంది. దీంతో పని లేని సమయంలోనూ డెవలపర్‌కు వేతనం ఇవ్వాల్సిన భారం తప్పుతుంది.
అన్ని టెక్నాలజీల్లోనూ సేవలు..
పీహెచ్‌పీ, పైథాన్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, యాంగ్లర్ జేఎస్, మీన్ స్టాక్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, హెచ్‌టీఎంఎల్5, ఐఓటీ, మాజెంటో, వర్డ్ ప్రాసెసర్ వంటి అన్ని రకాల టెక్నాలజీల్లోనూ సేవలందిస్తున్నాం. రిటైల్, ఈ-కామర్స్, హెల్త్‌కేర్, టెలికం, రియల్టీ, ట్రావెల్, అగ్రికల్చర్, ఆటోమొబైల్స్, ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో సేవలందించేందుకు 100 మంది నిపుణుల్ని నియమిం చుకున్నాం. అందరూ ఆయా టెక్నాలజీల్లో మూడేళ్ల అనుభవం ఉన్నవారే కావటం మా ప్రత్యేకత. ఒక్కో డెవలపర్‌కు రూ.40 వేల కనీస వేతనం ఇస్తున్నాం.
2 నెలల్లో 4-6 కోట్ల నిధులు..
ప్రస్తుతం నెలకు 3-5 కంపెనీల వరకు నిపుణులను అద్దెకిస్తున్నాం. నెలకు రూ.30 లక్షల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. ఇప్పటివరకు సంస్థలో వ్యక్తిగత, కుటుంబ పెట్టుబడులే ఉన్నాయి. తొలిసారిగా నిధుల సమీకరణ చేయాలని నిర్ణయించాం. మరో 2 నెలల్లో రూ.4-6 కోట్ల నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చిస్తున్నాం. త్వరలోనే డీల్‌ను క్లోజ్ చేసి.. పూర్తి వివరాలు వెల్లడిస్తాం.
వైజాగ్, హైదరాబాద్‌లో నియామకాలు..
ఇప్పటివరకు జస్ట్ డయల్, శుభ్‌కార్ట్, ఆటోమొబీ, స్కిల్ స్పీడ్, పిట్టిగ్రూప్, స్లాటర్ కన్సల్టింగ్, సెంతిక్ వంటి 50కి పైగా కంపెనీలు మా నిపుణుల్ని అద్దెకు తీసుకున్నాయి. ప్రస్తుతం 35 కంపెనీల్లో మా నిపుణులు అద్దెకు పనిచేస్తున్నారు. రోజులు, కంపెనీ అవసరాలు, పని, టెక్నాలజీ, డెవలపర్ అనుభవాన్ని బట్టి చార్జీ ఉంటుంది. తొలిసారిగా హైదరాబాద్, విశాఖపట్నం నుంచి డెవలపర్లను నియమించుకోనున్నాం. మరో రెండు నెలల్లో 15-20 మంది డెవలపర్లను ఉద్యోగులుగా తీసుకుంటాం.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...