తుమ్మపాల సుగర్స్ అభివృద్ధికి కమిటీ
రైతులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అనకాపల్లి/తుమ్మపాల/అనకాపల్లి రూరల్/చోడవరం:తుమ్మపాల సహకార చక్కెర కర్మాగారాన్ని అభివృద్ధి చేసేందుకు నిపుణులతో కూడిన కమిటీని వేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముఖ్యమంత్రి శుక్రవారం జిల్లాలో జరిపిన పర్యటనలో భాగంగా తుమ్మపాల చక్కెర కర్మాగార ఆవరణలో రైతులతో మాట్లాడుతూ మూడు నెలల్లో కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా కర్మాగారం ఆధునికీకరణ, విస్తరణ వంటి అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. డెరైక్టర్ ఆఫ్ సుగర్స్తో కూడిన బృందం ఇక్కడికి వచ్చి అధ్యయనం చేస్తుందన్నారు. నివేదిక ఆధారంగా రైతులకు శాశ్వతంగా ఉపయోగపడే విధంగా తుమ్మపాల కర్మాగారాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
కర్మాగారంలో చక్కెరను విక్రయించి చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీతాల బకాయిలు చెల్లిస్తామన్నారు. ముఖ్యమంత్రి వెంట జిల్లా మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, కలెక్టర్ యువరాజ్, జేసీ ప్రవీణ్ కుమార్, ఆర్డీవో వసంతరాయుడు, కర్మాగారం ఎమ్డీ ప్రభుదాస్, ఎంపీపీ కొణతాల వెంకటసావిత్రి, టీడీపీ నేతలు కొణతాల శ్రీను, బుద్ధ నాగజగదీష్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.
నూకాంబిక సన్నిధిలో చంద్రబాబు
శ్రీ నూకాంబిక అమ్మవారిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం దర్శించుకున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చిన చంద్రబాబు ఆలయ ముఖ ద్వారం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. ఈయనకు మేళతాళాలతో ఎమ్మెల్యే పీలా గోవింద, దేవాదాయ శాఖాధికారులు ఎన్.ఎస్.ఎం.మూర్తి, పుష్కనాథం, ఎన్.ఎల్.ఎన్.శాస్త్రి, ఆలయ ఈఓ సుజాత స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అమ్మవారి భారీ చిత్రపటాన్ని బహుకరించారు.
ఆస్పత్రి వైద్యులతో సమీక్ష
అనకాపల్లి వంద పడకల ఆస్పత్రిని ముఖ్యమంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మించనున్న భవనాన్ని, మహిళా, ఆరోగ్య శ్రీ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలో సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో సమీక్షా సమావేశమయ్యారు.
ఆరోగ్యశ్రీకి నగదు పెంపు...
ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్స చేయించుకున్న వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.2 లక్షల మొత్తాన్ని రూ.2.5 లక్షలకు పెంచనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన వెంట మంత్రులు అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలా గోవింద, పంచకర్ల రమేశ్‌బాబు, పెతకంశెట్టి గణబాబు, వానపల్లి గణేశ్‌కుమార్, జెడ్పీ చైర్మన్ లాలం భవాని ఉన్నారు.
గోవాడ సామర్థ్యం 8 లక్షల టన్నులకు పెంపు
గోవాడ సహకార చక్కెర కర్మాగారం క్రషింగ్ సామర్థ్యాన్ని 8 లక్షల టన్నులకు పెంచేందుకు చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. చోడవరంలో శుక్రవారం జరిగిన ‘పొలం పిలుస్తోంది-ఆవిష్కరణ’ సభలో ఆయన మాట్లాడుతూ యాజమాన్యం చెరకు రైతుల పిల్లల కోసం ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తే అనుమతిస్తానని ప్రకటించారు. ఈ సందర్భగా చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి చక్కెర కర్మాగారం తరపున రూ.30 లక్షల చెక్కును ముఖ్యమంత్రికి చైర్మన్ మల్లునాయుడు, ఎమ్డీ రమణారావు, ఎమ్మెల్యే రాజు అందజేశారు. అనంతరం కర్మాగారం అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.