ఎడ్యు న్యూస్
త్వరలో అన్ని యూనివర్సిటీల్లో ఉచిత వైఫై
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో రానున్న రోజుల్లో వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో నాణ్యమైన మెటీరియల్ పొందవచ్చు. ఫ్యాకల్టీ కొరతను ఎదుర్కొంటున్న ఎన్నో విద్యా సంస్థలకు వైఫై సౌకర్యం ఎంతో లాభదాయకం. వైఫై ద్వారా దేశవ్యాప్తంగా 600 యూనివర్సిటీలు, 20 వేల కళాశాలలు లబ్ధి పొందే అవకాశం ఉంది. ఉచిత ఇంటర్నెట్ ద్వారా మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు (మూక్స్) అభ్యసించడానికి కూడా వీలు కలుగుతుంది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన ఫ్యాకల్టీ చెప్పే వీడియో లెసన్స్, గెస్ట్ లెక్చర్స్‌ను చూడొచ్చు. ఇప్పటికే మనదేశంలో కొన్ని విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి.
నెట్‌ను నిర్వహించనున్న సీబీఎస్ఈ
దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), కళాశాలల్లో లెక్చరర్‌షిప్‌నకు అర్హత సాధించాలంటే రాయాల్సిన పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్). ఇప్పటివరకు దీన్ని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్వహించింది. ఈ ఏడాది డిసెంబర్లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నెట్‌ను నిర్వహిస్తుందని యూజీసీ వెల్లడించింది.
విద్యా సంస్థల్లో డీఆర్డీవో.. టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్లు
దేశంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో).. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ముందుగా ఐఐటీ - బాంబే, జాదవ్‌పూర్ యూనివర్సిటీ - కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర రక్షణ, ఆర్థిక శాఖల మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. డీఆర్డీవో ఈ కేంద్రాల్లో శాస్త్రవేత్తలు, రీసెర్చ్ ఫ్యాకల్టీతో వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంది. ఈ కేంద్రాల ద్వారా విద్యార్థులు పరిశోధనల్లో అత్యుత్తమ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. 2012లో ఐఐటీ - చెన్నైలో డీఆర్డీవో .. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది.