అభివృద్ధికి మార్గదర్శిగా ‘ప్రగతి భవన్’
ఇక అధికారిక కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే..: సీఎం కేసీఆర్
సమాజంలోని అన్ని వర్గాలతో నేరుగా మాట్లాడుతాం
ఆయా వర్గాల వారిని ప్రభుత్వ ఖర్చులతోనే రప్పిస్తాం
క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చర్యలు చేపడతాం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రారంభిం చుకున్న ‘ప్రగతి భవన్’ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షిం చారు. దానిలో భాగంగా నిర్మించిన ‘జనహిత’ సమావేశ మందిరం ప్రభుత్వ పథకాలు, విధానాల రూపకల్పనలకు, కార్యక్రమాల అమలు కార్యాచరణ సిద్ధం చేయడానికి, ప్రజలతో ముఖాముఖి నిర్వహించడానికి ఉపయోగపడుతుం దన్నారు. కలెక్టర్ల సదస్సుతో సహా ఇతర ఏ సమావేశం నిర్వహించాలనుకున్నా ఇప్పటి వరకు తగిన స్థలం లేక హోటళ్ల చుట్టూ తిరిగామని, ఇప్పుడా సమస్య తీరిందని పేర్కొన్నారు. ఇకపై జనహితలో నిరంతరం వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ, పాలనా ఫలితాలు క్షేత్రస్థాయిలో అమలు కావడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
బేగంపేటలో ముఖ్యమంత్రి నూతన క్యాంపు కార్యాలయం ‘ప్రగతి భవన్’ను ప్రారంభించిన అనంతరం అందులోని చాంబర్లో భవన్ నిర్వహణ, జనహిత ఉద్దేశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ కె.కేశవరావు, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. సమాజంలో అనేక వర్గాల ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతుంటారని.. ప్రభుత్వం వారితో నేరుగా మాట్లాడితే పరిష్కారం దొరుకు తుందని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రైతులు, కార్మికులు, మహిళ లు, వృత్తిపనివారు సహా ప్రతి వర్గంతో ఇకపై ‘జనహిత’లో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తామని... వారిని ప్రభుత్వ ఖర్చులతోనే హైదరాబాద్‌కు రప్పించి మాట్లాడతామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసు కుని, ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన పంథాను ఖరారు చేస్తామని చెప్పారు. ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ డిన్నర్లు, ఉగాది పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు తదితర అధికారిక కార్యక్రమాలన్నీ ఇకపై ప్రగతిభవన్లోనే జరుగుతాయని సీఎం ప్రకటించారు.
ఎస్టీ విద్యార్థుల ఎంటీఎఫ్పై తొలి సంతకం
పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఎస్సీ, బీసీ విద్యార్థుల మాదిరిగానే ఇకపై ఎస్టీ విద్యార్థులకు సైతం నెలవారీగా నిర్వహణ ఖర్చు (ఎంటీఎఫ్) చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సంతకం చేసిన తొలి ఉత్తర్వు ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలోని 101 ఎస్టీ హాస్టళ్లలో 14,685 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి ప్రతినెలా కాకుండా ఆరు నెలలకు, ఏడాదికోసారి బిల్లులు వచ్చేవి. దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి... ఎస్టీ విద్యార్థులకు నెలవారీగా చెల్లించాలని ఆదేశించారు. దీని ప్రకారం ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,050 నుంచి రూ.1,200 వరకు అందనున్నాయి.