మా కాలనీకి మీరేం చేశారు?
కె.గంగవరం :
తమ కాలనీకి ఏం చేశారో చెప్పాలం టూ రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులను ప్రజలు నిలదీశారు. సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యే స్థానికులపై ఆగ్రహం వ్యక్తం చేయటంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేకు వెన్నుదన్నుగా నిలిచిన సొంత సామాజిక వర్గంవారే ఆయనను నిలదీయడం కొస మెరుపు. జనచైతన్య యాత్రలో భాగంగా ఎమ్మెల్యే త్రిమూర్తులు బుధవారం కె.గంగవరం, రైల్వే కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. డ్రెయినేజీ వ్యవస్థ ఆధ్వానంగా ఉందని, చుక్క తాగునీరు కూడా ఉండడం లేదని కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. వారు అక్కడితో ఊరుకోకుండా తమ సమస్యలను కనీసం స్థానిక ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే త్రిమూర్తులను నిలదీశారు. తాము ఫిర్యాదు చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులను మీరెందుకు అడగటం లేదని వారు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు ఎన్నికల్లో డబ్బులు తీసుకుని ఓటేశారని, నేను మీకేం చేయాలంటూ ధ్వజమెత్తారు. దీంతో మండిపడ్డ స్థానికులు తామెవరం డబ్బులు తీసుకుని ఓటేయలేదని ఘాటుగానే బదులిచ్చారు. దీంతో ఖంగుతిన్న ఎమ్మెల్యే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సమస్యను వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.