ఇక సేవపైనే దృష్టి
సిద్దిపేట రూరల్: ఇన్ని రోజులు ఎన్నికలని.. ఓట్లని తిరిగినం.. ఇప్పుడు అలాంటిదేమీలేదని, ప్రజాసేవ, గ్రామాల అభివృద్ది చేయడమే పని అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట పరిధిలోని నర్సాపూర్, ఎల్లుపల్లి గ్రామాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి బాలవికాస వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో మంత్రి మాట్లాడుతూ తాను ఏ నీళ్లు తాగితే.. తన నియోజకవర్గం ప్రజలు కూడా ఆ నీళ్లే తాగాలన్నది తన లక్ష్యమన్నారు. గ్రామాల్లో ప్రజలందరు నూటికి నూరు శాతం స్వచ్ఛమైన నీళ్లు తాగాలని బాలవికాస వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికి వరకు 60బాలవికాస వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, మరికొన్ని గ్రామాల్లో పూర్తి చేస్తే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బాలవికాస ప్లాంట్లు పూర్తవుతాయన్నారు.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట ప్రాంత ప్రజలు హరీష్‌రావును ఆదరించినట్లు, తనను కూడా భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఎంతో రుణపడి ఉంటానన్నారు. బాలవికాస సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ శౌరిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఈ నీళ్లను తాగాలని, నీళ్లను ఎప్పుడైనా కావాలన్నా తీసుకోవడానికి ఏటీఎం సౌకర్యం ఉందన్నారు. అంతకు ముందు ఆయా గ్రామాల్లో మంచినీటి క్యాన్లను అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఓఎస్డీ బాల్‌రాజు, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, ఎంపీపీ ఎర్ర యాదయ్య, సర్పంచ్ బాలకిష్ణారెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ వంగ ప్రవీణ్‌రెడ్డి, బాలవికాస ప్రతినిధులు ఉపేందర్, రవీందర్, నాయకులు కోరె ఎల్లయ్య, పూల హన్మంతారెడ్డి, చెన్నోజీ రాజుచారి, బాల్‌రంగం, రవీందర్‌రెడ్డి, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేను చెరువుల మంత్రిని..
నంగునూరు: ‘నేను చెరువుల మంత్రిని.. చెరువులు నిండేదాక వదుల్తున, నిజాం కాలంలో నిర్మించిన చెరువులను నింపేందుకు కృషి చేస్తా’ అని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలసి నంగునూరు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా రాజగోపాల్‌పేటలో రెండు అంగన్వాడీ కేంద్రాలకు శంకుస్థాపన చేసి వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా 5001 పెద్ద, 31వేల చిన్న చెర్వులు కలిపి మొత్తం 36 వేల చెరువులు ఉన్నట్లు గుర్తించామన్నారు.
సీమాంధ్ర పాలకులు చెరువులను పట్టించుకోక పోవడంతో అవి ధ్వంసమయ్యాయని, తూములు, అలుగులు మరమ్మతు చేసి చెరువులు కళకళలాడేలా చేస్తామన్నారు. సిద్దిపేటకు ప్రాణహిత చేవెళ్ల నీటిని తెచ్చి తడ్కపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన రిజర్వాయిర్ ద్వారా నంగునూరు మండలానికి సాగునీరు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురికి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం రాజగోపాల్‌పేటలో ఇటీవల మరణించిన తలారి పద్మ, సిద్దన్నపేటలో మరణించిన బెదురు అయిలయ్య, కోనాయిపల్లిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీకాంత్‌రెడ్డి, సోమిరెడ్డి, రమేశ్‌గౌడ్, రాజుగౌడ్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఓఎస్డీ బాలరాజు, అధికారులు ప్రభాకర్, నరేందర్, బ్రహ్మం, నరేశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట బస్టాండ్‌ను తనిఖీ చేసిన హరీష్‌రావు
సిద్దిపేట జోన్: సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్‌ను మంత్రి హరీష్‌రావు ఆదివారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలోని అపరిశుభ్ర వాతావరణంపై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూత్రశాలల దగ్గర దుర్గంధం వెదజల్లడం పట్ల ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్న చిన్న సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఆర్టీసీ డీఎం భానుకిరణ్‌ను ఆదేశించారు. అనంతరం బస్టాండ్ ఆవరణంలోని స్టాల్స్‌ను పరిశీలించారు. లీకేజీలను గుర్తించిన ఆయన వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఆర్టీసీ డిపో మేనేజర్ భానుకిరణ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మానకోడూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఆర్డీఓ ముత్యంరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చిన్న, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, జంగిటి కనకరాజు, కూర బాల్‌రెడ్డి, శేషుకుమార్ తదితరులున్నారు.