చెప్పింది కొండంత... చేసింది గోరంత
కనగానపల్లి: దత్తత గ్రామాల అభివృద్ధి పూర్తిగా పడకేసింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ దత్తతకు తీసుకున్న కనగానపల్లి మండలంలోని ముత్తువకుంట్ల ఇందుకు అద్దం పడుతోంది. ఆ గ్రామ ప్రజలకు అతను ఇచ్చిన హామీల్లో పది శాతం కూడా నెరవేర్చకపోవడం గమనార్హం. రెండున్నర సంవత్సరాల క్రితం (2015, జనవరి 24న) రామగిరి మండలం వెంకటాపురం గ్రామానికి వచ్చిన వివేక్ ఒబేరాయ్ను ముత్తువకుంట్ల వాసులకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత పరిచయం చేశారు. ఈ సందర్భంగా అతను ముత్తువకుంట్ల గ్రామాన్ని దత్తతకు తీసుకుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీనిచ్చారు.
చెత్త బుట్టలు ఇచ్చి...
2016, జనవరి 12న ముత్తువకుంట్లకు వచ్చిన ఒబేరాయ్.. సంక్రాంతి సంబరాలలో పాల్గొని, తాను ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా గ్రామ వీధుల్లో ఎల్ఈడీ బల్బులు వేయించారు. పారిశుద్ధ్యం నిర్వహణలో భాగంగా మహిళలకు చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముత్తవకుంట్లను దేశవ్యాప్తంగా మరే గ్రామం అభివృద్ధి చెందనంత గొప్పగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఆ తర్వాతి రోజు వెళ్లిపోయిన అతను నేటికీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు కదా.. కనీసం గ్రామాభివృద్ధిని కూడా పట్టించుకోలేదు. దీనిపై స్థానికుల్లో అసహనం వ్యక్తమవుతోంది. గ్రామంలోని దళిత వాడలో కనీస మౌలిక వసతులు లేవు. సీసీ రోడ్లు, తాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
అభివృద్ధి చేసింది ఏమీ లేదు
హీరో వివేక్ ఒబేరాయ్ ఇక్కడికి వచ్చినపుడు మా గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాయని చెప్పాడు. కాని అతను పెద్దగా చేసింది ఏమీ లేదు. అతను వేసి పోయిన వీధి లైట్లు కూడా ఇప్పుడు పడడం లేదు. హీరో దత్తత తీసుకున్నాడంటూ ప్రజాప్రతినిధులు కూడా మా గ్రామాభివృద్ధిని పట్టించుకోవడం లేదు. మా కాలనీలో కనీస మౌలిక వసతులు కూడా లేక జీవిస్తున్నాం.
- అనిల్, ముత్తువకుంట్ల గ్రామం, కనగానపల్లి మండలం