కోడ్ పరిధిలోకి డ్వాక్రా మహిళలు
సాక్షి, సంగారెడ్డి: డ్వాక్రా సంఘాలు పల్లెపల్లెకు విస్తరించాయి. స్వయం ఆలంబనతో తోటి మహిళల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్నీ రాజకీయ పక్షాలు స్వయం సహాయక సంఘాలను ప్రసన్నం చేసుకోడానికి శతవిధాలుగా ప్రయత్నించడం ఇప్పటి వరకు అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో సైతం అధికార పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఎస్‌హెచ్‌జీల సేవలను వినియోగించుకుంది. మండల, గ్రామ సమైక్యల ద్వారా మహిళలకు డబ్బులు, చీరలు పంచిన సంఘటనలు పరిపాటిగా మారాయి. అయితే, ప్రస్తుత సాధారణ ఎన్నికల్లో మాత్రం ఎస్‌హెచ్‌జీలను ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకోడానికి ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.
జిల్లా సమైక్య, మండల, గ్రామైక్య సంఘాల ఖాతాలపై ఇప్పటికే నిఘా వేశారు. డీఆర్డీఏ, సెర్ప్ ఖాతాలు నుంచి కాక మరే ఇతర ఖాతాల నుంచి డబ్బులు బదిలీ చేస్తే గుర్తించి సమాచారాన్ని అందజేయాలని ఇప్పటికే బ్యాంకర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్ ఆదేశించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున.. జిల్లా, మండల, గ్రామ సమాఖ్యల సమావేశాల్లో ఎవరూ రాజకీయాలు మాట్లాడరాదని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్డీఏ) ప్రాజెక్టు డెరైక్టర్ రాజేశ్వర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్డీఏ సిబ్బంది ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా..ఎస్‌హెచ్‌జీలను ప్రేరేపించినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. సభ్యులను పదవుల నుంచి తొలగించడమే కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే గ్రామ సమన్వయకర్త, కమ్యూనిటీ సమన్వయకర్త, ఏపీఎంఎస్, ఏసీఎస్‌లను విధుల నుంచి తొలగిస్తామన్నారు.