ఒడిదుడుకుల వారం
{పపంచ మార్కెట్లు, డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కారణాలు
మార్కెట్ ట్రెండ్‌పై నిపుణుల అంచనా
ముంబై : బలహీనంగా వున్న ప్రపంచ మార్కెట్లు, త్వరలో ముగియనున్న ఆగస్టు డెరివేటివ్స్ కాంట్రాక్టుల కారణంగా ఈ వారం భారత్ ఈక్విటీలు ఒడిదుడుకులకు లోనవుతాయని విశ్లేషకులు అంచనావేశారు. చైనా వృద్ధి మందగించిందన్న భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు గతవారం భారీగా తగ్గాయి. శుక్రవారం అమెరికా మార్కెట్ సైతం అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఈ ప్రభావం మన మార్కెట్‌పై కూడా వుంటుందని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులు వచ్చే గురువారం ముగియనున్నందున, భారత్ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు.
ఇదే సమయంలో రూపాయి పతనం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీయవచ్చని జైఫిన్ అడ్వయిజర్స్ దేవేంద్ర నావ్గి అన్నారు. గతవారం డాలరుతో రూపాయి విలువ రెండేళ్ల కనిష్టస్థాయి 65.83 వద్దకు పడిపోయిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం తగ్గిన కారణంగా రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను తగ్గింవచ్చన్న అంచనాలు మార్కెట్‌కు ఊతమివ్వవచ్చని జేమ్స్ వివరించారు. అలాగే కనీస ప్రత్యామ్నాయ పన్ను(మ్యాట్)పై విదేశీ ఇన్వెస్టర్లకు ఊరట లభించడం మార్కెట్‌కు సానుకూలమని అన్నారు.
గత వారం మార్కెట్....
గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 701 పాయింట్లు పతనమై 27,366 పాయింట్ల వద్ద ముగిసింది. వివిధ దేశాల కరెన్సీలు కుప్పకూలడంతో ప్రపంచవ్యాప్తంగా గతవారం మార్కెట్లు క్షీణించాయి.