ఎమ్మెల్సీ ఓట్లు కొనేయండి..!
విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘ నేతలపై మంత్రుల ఒత్తిడి
హోటల్లో రహస్య మంతనాలు
ఎంత కావాలో చెప్పాలని బేరసారాలు
విజయవాడ : ‘ఏ రూట్లో వెళతారో.. ఎలా వెళ్తారో.. మాకు తెలి యదు.. ఒక్క ఓటు కూడా వేరే వారికి వెళ్లకూడదు.. డబ్బు ఎంత కావాలో అడగండి.. ’ ఇదీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎలాగైనా రాబట్టుకోవాలనే ఆలోచనలో మంత్రులు టీడీపీలోని ముఖ్య నాయకులకు చెప్పిన మాటలు. ‘ఇంతమంది నాయకులం ఇక్కడ ఉన్నాం.. ఒకవేళ మనం గెలవలేకపోతే అవమానంగా ఉంటుంది. సీఎం కూడా మనపై మండిపడే అవకాశం ఉంది. అందుకనే చెబుతున్నాం. ఎలాగైనా గెలవాల్సిందే..’ అం టూ ఉపాధ్యాయ సంఘాల్లోని పలువురు నాయకులకు మంత్రులు, ముఖ్య నాయకులు ఉద్బోధ చేశారు.
శుక్రవారం ఉదయం నుంచి బందరురోడ్డులోని హోటల్ ఫార్చ్యూన్ మురళీపార్కులో మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు.. ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నాయకులను పిలిపించి ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటర్లు ఏమడుగుతున్నారు, ఎవరికి ఏం కావాలి.. వంటి విషయాలపై వాకబు చేశారు. ‘రామకృష్ణను మన పార్టీ బలపరిచింది. ఎలాగైనా ఆయనే గెలవాలి..’ అని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల కరస్పాండెంట్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. శుక్రవారం రాత్రి వరకు మంత్రులిద్దరూ ఇదే పనిలో నిమగ్నమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న మీడియా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసేందుకు వెళితే తీయకూడదంటూ కోపం ప్రదర్శించారు.
హామీల వల
ఈ సందర్భంగా మంత్రులిద్దరూ ఉపాధ్యాయుల వద్ద హామీల వర్షం గుప్పించారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు సంబంధించి 2006 నుంచి యూజీసీ స్కేల్ అమలు జరుగుతున్నందున అప్పటి నుంచే ఫిట్మెంట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. అలాగే, ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో లెక్చరర్లు అనే పదాన్ని తొలగించారని, మన రాష్ట్రంలోనూ ఆ పదాన్ని తీసేసి అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా మార్చాలని కొందరు ఉపాధ్యాయులు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇలా ఉపాధ్యాయులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న మంత్రులు తమ అభ్యర్థిని గెలిపిస్తే పరిష్కరిస్తామని అభయమిచ్చారు.
వ్యూహం మార్చిన మంత్రి ఉమా
టీడీపీ నగర అధ్యక్షుడు బుద్దా వెంకన్న నివాసంలో శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెళ్లారు. అయితే, ఉపాధ్యాయులను ప్రలోభాలకు గురిచేసేందుకు బుద్దా వెంకన్న ఇంటికి మంత్రి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న సీపీఎం నగర నాయకులు, కార్యకర్తలు ఆ ఇంటి వద్దకు వచ్చారు. దీంతో మంత్రి వ్యూహం మార్చారు. ప్రాజెక్టులు, అసెంబ్లీ వ్యవహారాలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై విమర్శలు చేసేందుకు ఒంటిగంటకు ప్రెస్మీట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పి అప్పటికప్పుడు అక్కడ విలేకరులతో మాట్లాడి ఎమ్మెల్సీ హడావుడిని పక్కదోవ పట్టించారు. వీరితో పాటు టీడీపీ రాష్ట్ర నాయకుడు ముద్దుకృష్ణమనాయుడు ఉన్నారు.
కాగా, మేయర్ శ్రీధర్, డెప్యూటీ మేయర్ రమణారావు కూడా ఉపాధ్యాయులతో మంతనాలు జరుపుతున్నారు. యూటీఎఫ్ నాయకత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టాలని, ఎన్నికల్లో వారిని ఓడించి తమ సత్తా ఏంటో చూపించాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నారు. కేవలం ఉపాధ్యాయ సంఘాల నేతలు, పలు పాఠశాలలు, కాలేజీల కరస్పాండెంట్లనే కాకుండా విద్యాశాఖలోని ముఖ్య అధికారులను కూడా పిలిపించి లోగుట్టు విషయాలు చర్చించినట్లు సమాచారం.