ఆంధ్రా ఉద్యోగులను కాపాడుతాం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే ఇతర ప్రాంతాల ఉద్యోగులను కాపాడే బాధ్యతను తాము తీసుకుంటామని, సీమాంధ్ర ఉద్యోగులు విభజనకు సహకరించాలని టీఎన్జీవోస్‌ల అధ్యక్షుడు దేవీప్రసాదరావు కోరారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో సంక్షేమ శాఖల్లో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగుల ఆధ్వర్యంలో శాంతి సద్భావనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో దేవీప్రసాద్ మాట్లాడుతూ కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల్లోనికి వచ్చి సీమాంధ్ర ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అలా వచ్చే రాజకీయ నాయకులు కార్యాలయాల్లో నుంచి వెళ్లిపోయేంత వరకు తెలంగాణ ఉద్యోగులు నిరసన తెలపాలని ఆయన కోరారు.
తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి. విఠల్ మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదని అన్నారు. ఆంధ్ర ప్రాంత ంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై దాడులు చేస్తున్నారని, ఎంపీపై దాడి ఏ సమైక్యతకు నిదర్శనమని ప్రశ్నించారు. సీమాంధ్రలో పనిచేసే ఉద్యోగులు గన్మెన్ల రక్షణలో ఉంటున్నారని, అలాంటి పరిస్థితి ఇక్కడ లేదని అన్నారు. సభకు టీఎన్జీవో నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, టీఎన్జీవోల ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సి.హెచ్.బాలరాజు వివిధ తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.