గొట్టంలో రైలు... రైల్లో మనం!
బుల్లెట్ ట్రెయిన్ కంటే వేగంగా వెళుతుంది! అంతెందుకు వేగంలో విమానం కూడా దీని ముందు దిగదుడుపే. పైగా ప్రయాణ ఖర్చులు బాగా చౌక! ఈ వివరాలన్నీ ఫొటోలో కనిపిస్తున్న ‘హైపర్‌లూప్’ గురించే. అన్నీ సవ్యంగా సాగితే ఇంకొన్నేళ్లలో ప్రపంచ రవాణా వ్యవస్థను సమూలంగా మార్చివేసే సామర్థ్యమున్న టెక్నాలజీ ఇది. వాహనాల్లో మనం వాడే పెట్రోలు, డీజిళ్లలో గురుత్వాకర్షణ శక్తి, గాలి నిరోధకతలను ఎదుర్కొనేందుకు దాదాపు 80 శాతం వృధా అవుతుందని తెలుసు కదా... ఈ రెండు అడ్డంకుల్లేకుండా చేస్తే అతి తక్కువ ఇంధనంతో చాలా వేగంగా దూసుకెళ్లవచ్చు. ఓ గొట్టం లాంటి నిర్మాణంతో హైపర్‌లూప్ సాధించాలనుకుంటున్నది ఇదే.
అమెరికాలోని టెస్లా కంపెనీ యజమాని ఎలన్ మస్క్ కొన్నేళ్ల క్రితం ఈ ఆలోచనను ప్రపంచం ముందు పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇది ఎన్నో దశలు దాటింది. డిజైన్ పోటీలు, ఇంజిన్లు, కేబిన్ల తయారీ నమూనా బుల్లి ట్రెయిన్లతో పరీక్షల వంటివన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి కూడా. తాజాగా అసలైన సైజులో హైపర్‌లూప్ టెక్నాలజీని పరీక్షించేందుకు నెవడా (అమెరికా) ఎడారిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపు అర కిలోమీటర్ పొడవైన ఈ ట్రాక్‌పై కనిపిస్తున్న గొట్టం 10 అడుగుల వ్యాసముంటుంది. ఈ గొట్టంలోపల రైల్వే బోగీ లాంటి నిర్మాణంలో ప్రయాణీకులు కూర్చుంటారు. ఆ తర్వాత రయ్యిన దూసుకెళ్లడమే!
కేవలం 150 మంది ఇంజినీర్ల సాయంతో కొన్ని నెలల వ్యవధిలో ఈ ‘డెవ్‌లూప్’ ట్రాక్‌ను సిద్ధం చేశామని, హైపర్‌లూప్ వన్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జాష్ గైగెల్ అంటున్నారు. హైపర్‌లూప్ టెక్నాలజీ ద్వారా ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ఇప్పటికే అనేక దేశాలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దుబాయిలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం హైపర్‌లూప్ వన్‌తో చర్చలు జరుపుతూంటే.. భారత్‌లో ట్రాక్ ఏర్పాటు చేస్తామని హైపర్‌లూప్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఒకవేళ ఇది అందుబాటులోకి వస్తే న్యూఢిల్లీ నుంచి ముంబైకి వచ్చేందుకు పట్టే సమయం ఎంతో తెలుసా? కేవలం 70 నిమిషాలు!