తమ్ముళ్ల అపచారం... సరిదిద్దిన ఈవో
అర్ధనగ్నంగా సారె తీసుకెళ్లిన తెలుగు తమ్ముళ్లు
సంప్రదాయూన్ని నిలబెట్టిన ఈవో
ఆలయ నియమాలతో సారె సమర్పించిన ఎమ్మెల్యే
తిరుపతి రూరల్: పాకాల మండలం ఊట్లవారిపల్లెగుట్టలో కొలువైన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయంలో ఆదివారం అపచారం చోటుచేసుకుంది. సంప్రదాయాలకు, కాణిపాక శ్రీవరసిద్ధి వినాయక స్వామి సారె పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు వ్యవహరించారు. సంప్రదాయూనికి విరుద్ధంగా ఎమ్మెల్యే వచ్చేలోగా సారె సమర్పించాలనే దురాలోచనతో పంచెలు ఊడిపోయి అర్ధనగ్నంగా పరుగులు తీశారు. వీరి వాలకం చూసి భక్తులు అసహ్యించుకున్నారు.
స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి ప్రతి ఏడాదీ పట్టు వస్త్రాలు, సారె తీసుకురావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఆదివారం కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయం నుంచి ఊట్లవారిపల్లె కొండపై కొలువైన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయానికి అధికారులు సారెను తీసుకొచ్చారు. ఈ సారెను చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి అధికారులతో కలిసి తీసుకెళ్లాల్సి ఉంది.
అయితే మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు, కొంత మంది టీడీపీ నేతలు సారెను తీసుకొచ్చిన కాణిపాకం ఆలయ అధికారుల వాహనాలపై దాడిచేశారు. ఈవో వచ్చేవరకు సారె ఇవ్వకపోవడంతో తమ్ముళ్లు ఆగ్రహానికి గురయ్యారు. అధికారులపై దౌర్జన్యం చేశారు. ఆపై అధికారుల నుంచి సారె లాక్కుని కొండపైకి పరుగులు తీశారు. ఈ క్రమంలో సంప్రదాయ దుస్తుల్లో ఉన్న తమ్ముళ్ల పంచెలు ఊడిపోయాయి. అర్ధనగ్నంగా ఉన్నా లెక్కచేయకుండా సారెను తీసుకెళ్లి ఆలయం ముందు పెట్టి అక్కడి నుంచి వచ్చేశారు.
అరుణమ్మ హుందాగా వ్యవహరించాలి
రాజకీయాలు చేసేందుకు చాలా వేదికలున్నాయి. ప్రజల్లో బలముంటే అక్కడ తేల్చుకోవాలేతప్ప దైవ కైంకర్యాల్లో తలదూర్చడం మంచిది కాదు. ముప్పయ్యేళ్ల రాజకీయ అనుభవం, డెబ్బయ్యేళ్ల వయసున్న అరుణకుమారి చిన్నపిల్లలా వ్యవహరించడం పద్ధతికాదు. ఇకనైనా ఆమె ఇలాంటి పనులు మానుకోవాలి. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తన అనుచరులను రెచ్చగొట్టడం మంచిది కాదు.
- చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి
సాంప్రదాయూన్ని పాటించిన ఈవో
అనంతరం ఆలయూనికి చేరుకున్న ఈవో సీతారామిరెడ్డి గుట్టపై ఉన్న ఆలయం ముందు పెట్టిన సారెను కిందకు తీసుకువచ్చారు. ఆలయూనికి విచ్చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులకు మేళతాళాల నడుమ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ నిబంధనల మేరకు చెవిరెడ్డి దంపతులు గుట్ట కింద ఉన్న వినాయకుడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర సారెను తీసుకుని వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం ఈవో సీతారామిరెడ్డి, స్థానిక తహశీల్దార్, రెవెన్యూ, పంచాయతీ అధికారుల సమక్షంలో సారెను స్వామివారికి సంప్రదాయబద్దంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి దంపతులు సమర్పించారు.
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: ఈవో సీతారామిరెడ్డి
ఆలయం వద్ద సాంప్రదాయానికి, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. భక్తుల మనోభావాలు దెబ్బతినే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. ఆదివారం జరిగిన సంఘటనపై ఉన్నతాధికారుల సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.