శ్రీవారి దర్శన క్యూల్లో తొక్కిసలాట
శుక్రవారం కాలిబాట, శనివారం సర్వదర్శన క్యూల్లో మిన్నంటిన భక్తుల రోదనలు
తిరుమల: తిరుమలలో పోటెత్తిన భక్తుల రద్దీ వల్ల దర్శన క్యూల్లో తొక్కిసలాటలు జరిగాయి. పలువురు భక్తులు గాయపడ్డారు. శుక్ర, శనివారాల్లో కాలిబాట, సర్వదర్శన క్యూలైన్లలో భక్తుల రోదనలు మిన్నంటాయి. దసరా సెలవుల వల్ల శుక్రవారం నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దాంతోపాటు పెరటాశి నెల మూడో శనివారం కావడంతో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో నడచివచ్చే భక్తుల రద్దీ రెట్టింపైంది. రద్దీని ముందే ఊహించిన టీటీడీ అధికారులు శుక్రవారం నుంచి శనివారం వరకు నడచివచ్చే భక్తులకు కాలిబాటల్లో ఇచ్చే దివ్యదర్శనం టోకెన్లను రద్దుచేశారు.
అనూహ్యంగా పెరిగిన రద్దీ వల్ల శుక్రవారం తిరుమలలోని కాలిబాట క్యూలలో తొక్కిసలాటలు జరిగాయి. శనివారం శ్రీవారి దర్శనం కోసం సర్వదర్శన క్యూలైన్లలోకి భక్తులను అనుమతించారు. అయినా రద్దీ అనూహ్యంగా పెరగడంతో తొక్కిసలాటలు జరిగి పలువురు భక్తులు గాయపడ్డారు. కాగా, తిరుమలలో తొక్కిసలాటలు జరగడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, టీటీడీ ఈవో గిరిధర్ గోపాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతో మాట్లాడి అవాంచనీయ సంఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.