'ఉద్యోగం మానేసి కూలిపని చేసుకుంటా'
విజయవాడ: ఎస్సీ అధికారిని కాబట్టే తనను అడిషనల్ డీజీ భూపతిబాబు వేధింపులకు గురిచేస్తున్నారని విజయవాడ రైల్వే ఎస్పీ డాక్టర్ సీహెచ్.శ్యామ్‌ప్రసాద్ ఆరోపించారు. అవసరమైతే ఉద్యోగం మానేసి కూలిపని చేసుకుంటానని, ఆత్మాభిమానం చంపుకొని ఉద్యోగం చేయనని స్పష్టం చేశారు. తన ఆదేశాలను ఎప్పుడూ భూపతిబాబు వ్యతిరేకిస్తారని చెప్పారు. ట్రిబ్యునల్ తీర్పుపైనే తన భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు.
ఏ కారణం లేకుండా తనను బదిలీ చేస్తున్నారంటూ ఎస్పీ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)కు ఫిర్యాదు చేయడంతో శ్యామ్‌ప్రసాద్ పై పోలీసు బాస్‌ల వేధింపులు వేధింపులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎస్పీ బంగళాలో పనిచేసే ధోబీ (రజకుడు)ని, 20 ఏళ్లుగా పనిచేస్తున్న క్లీనింగ్ ఉద్యోగిని నిలుపుదల చేశారు.
గతంలో ఎస్పీకి ముగ్గురు డ్రైవర్లు మూడు షిప్టులలో అందుబాటులో ఉండేవారు. వీరిలో ఒక్క డ్రైవర్‌ను ఉంచి మిగిలిన ఇద్దరినీ తొలగించి వారికి వేరేచోట పోస్టింగ్ ఇచ్చినట్లు తెలిసింది. ఎస్పీ కోసం ఒక మోటార్ సైకిల్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. దీన్ని విజయవాడ సీఐకి కేటాయించారు. ఎంతో క్రమశిక్షణ కలిగిన డిపార్టుమెంట్లో ఐపీఎస్ స్థాయి అధికారిని ఈ విధంగా వేధించడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.