'క్షమాబిక్ష మా చేతుల్లో లేదు'
బుక్కరాయసముద్రం (అనంతపురం) : రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు సంబందించిన క్షమాబిక్ష తమ చేతుల్లో లేదని ప్రస్తుతం క్షమాబిక్ష వ్యవహారం సుప్రీం కోర్టులో నడుస్తోందని రాష్ట్ర జైళ్లశాఖ డీజి క్రిష్ణంరాజు పేర్కొన్నారు. గురువారం మండల పరిదిలోని ఓపెన్ ఎయిర్ జైలును పరిశీలించారు. ఆయన తోపాటు రాష్ట్ర జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్, డిఐజీ జయవర్ధన్ వున్నారు. ఈ సందర్బంగా డీజీ క్రిష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ జీవిత ఖైదీలుగా ఉన్న వారికి సంబందించిన క్షమాబిక్ష తమ చేతుల్లోగానీ, రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోగానీ లేదన్నారు. ఈ వ్యవహారం రాజీవ్‌గాంధీ హత్య కేసుతో ముడిపడి సుప్రీం కోర్టులో నడుస్తోందన్నారు. క్షమాబిక్ష ఇవ్వద్దని సుప్రీంకోర్డు స్టే ఇచ్చిందన్నారు. దీంతో ఈ వ్యవహారం పెండింగ్‌లో పడిందన్నారు. రాష్ట్రం విడిపోయాక తెలంగాణా, ఆంద్ర జైళ్లు,అధికారులు వేరు వేరుగా విడిపోయాయన్నారు. ఇప్పటికే ఉద్యోగులు కూడా ఎక్కడివారక్కడే పని చేస్తున్నారన్నారు.
అదే విదంగా రెడ్డిపల్లి ఓపన్ ఎయిర్‌జైలు వద్ద రెండు పెట్రోలు బంక్‌లు మంజూరయ్యాయన్నారు. వీటిపై ఇప్పటికే ఐఓసి వారితో ఒప్పందం పూర్తయ్యాయన్నారు. వీటిని నిర్మాణానికి జైలుకు సంబందించిన భూమి, స్థలం కూడా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ స్థలానికి జిల్లా కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి వుందన్నారు. సెంట్రల్ యూనివర్శిటికి జైలుకు సంబందించిన 502 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందన్నారు. వీటిలో 18 ఎకరాలులో నర్సరీ పెంచుతున్నామన్నారు. వీటికి మినహాయింపు ఇవ్వాల్సి వుంటుందన్నారు. త్వరలో పెట్రోలు బంక్‌లు ఏర్పాటు చేసి అందులో జీవిత ఖైదీలే విధులు నిర్వహిస్తారన్నారు. ఇది వరకు రాజమండ్రి, కడప, విశాఖపట్నం జైళ్లలో పెట్రోలు బంక్‌లు నడుస్తున్నాయన్నారు. అనంతపురం ఓపన్ ఎయిర్ జైలు నందు కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.