ఆరు నెలల్లో ఏసీబీకి సొంత భవనం
- డీజీ ఆర్.పి.ఠాకూర్
- భవన నిర్మాణ పనుల పరిశీలన
కర్నూలు : అవినీతి నిరోధక శాఖ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఆ శాఖ డీజీ ఆర్పీ ఠాకూర్ శనివారం పరిశీలించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయించి కార్యాలయానికి సొంత భవనంలోకి మారుస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం సి.క్యాంప్‌లోని క్వార్టర్స్‌లో ఏసీబీ కార్యాలయ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎ.క్యాంప్‌లోని సివిల్ సప్లయ్ గోడౌన్ పక్కన ప్రభుత్వం పది సెంట్ల స్థలం కేటాయించి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసింది. జి+1 నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏసీబీ డీజీ ఆర్.పి.ఠాకూర్ శనివారం సాయంత్రం హైదరబాదు నుంచి కర్నూలు చేరుకుని నిర్మాణ పనులను పరిశీలించారు. ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారని కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం ప్రారంభమైనందున ఆలస్యం జరగవచ్చునని కాంట్రాక్టర్ వివరించగా ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని సూచించారు. జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ గంగాధర్, డీఎస్పీ జయరామరాజు, కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, పోలీస్ హౌసింగ్ డీఈ సత్యనారాయణ, జేఈ శ్రీహరి, సీఐలు ఖాదర్ బాషా, నాగభూషణం, శ్రీనివాసరావు తదితరులు ఠాకూర్‌కు స్వాగతం పలికారు.