నాకెవరైనా ఐ లవ్ యు చెబితే భయం!
ఓ నాటకం పూరి జగన్నాథ్ జీవితాన్ని మార్చేసింది. ఆ డ్రామా చూసి, అతని తల్లిదండ్రులు పాతిక వేలు ఇచ్చి, ‘సినిమాలు చేసుకో’ అన్నారు. కసి మీద ఉన్న ఎవరికైనా ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ చాలదా? సినిమా డెరైక్టర్ కావాలని పూరి వచ్చాడు. అవమానాలు ఎదుర్కొన్నాడు.. ఎదురు దెబ్బలు తిన్నాడు. లైఫ్ ఈజ్ వార్ అంటాడు పూరి.. అందుకే యుద్ధం చేస్తున్నాడు.. సక్సెస్‌ఫుల్‌గా చేస్తున్నాడు. నేడు పూరి బర్త్‌డే. ఈ సందర్భంగా జరిపిన ‘స్పెషల్ ఇంటర్వ్యూ’...
♦ ఓసారి లైఫ్‌ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తోంది?
దర్శకుడిగా ఈ పదిహేనేళ్లల్లో 30 సినిమాలు తీశాను. జీవితం గురించి విశ్లేషించుకుంటే హ్యాపీగా ఉంది. నేను దేనికీ టెన్షన్ పడను. సినిమాలు లేకుండా నెల రోజులు ఖాళీగా ఉంటే టెన్షన్ మొదలవుతుంది. ఖాళీ లేకుండా చిన్నా, పెద్దా ఏదో ఒక సినిమా చేస్తూ ఉంటే చాలనుకుంటాను.
♦ తక్కువ రోజుల్లో తీస్తారు కాబట్టి, వంద సినిమాలు పూర్తి చేస్తారేమో?
50 సినిమాలు పూర్తి చేస్తా. కల్యాణ్ (పవన్ కల్యాణ్)తో ‘బద్రి’ తీస్తున్నప్పుడు ఆ చిత్రనిర్మాత త్రివిక్రమరావుగారు ‘ఎలా చేస్తాడో’ అని సందేహించారు. కానీ, మొదటిరోజు నా షూటింగ్ తీరు చూసి, ‘నువ్వు 50 సినిమాలు తీసేస్తావ్’ అన్నారు. అది జరుగుతుంది.
♦ ‘ఇంకెందుకు సినిమాలు.. వెళ్లిపోదాం’ అనిపించేంత అవమానాలు ఏమైనా జరిగాయా?
అవమానాలు జరిగాయి. డౌన్ఫాల్స్ ఉన్నాయి. ఏం జరిగినా ఇక్కణ్ణుంచి వెళ్లిపోవాలనుకోలేదు. ఎందుకంటే, ఎక్కడికి వెళ్లినా అక్కడా ఇలానే ఉంటుంది. నేనెప్పుడూ ‘లైఫ్ ఈజ్ వార్’ అని నమ్ముతాను. సో.. బతికున్నంత కాలం యుద్ధం చేయాల్సిందే.
♦ మీ సినిమాలు చూస్తే, సెంటిమెంట్స్ ఉండవేమో, అనుబంధాల మీద నమ్మకం ఉండదేమో అనిపిస్తుంటుంది?
సెంటిమెంట్స్ పెద్దగా లేవు. అనుబంధాల విలువ తెలుసు. నా ఫ్యామిలీ అంటే చాలా ప్రేమ. ఆ ప్రేమను వాళ్లతో చెప్పను. నేనెవరికీ ‘ఐ లవ్ యు’ చెప్పను. అది ఆడ అయినా కావొచ్చు.. మగ అయినా కావొచ్చు.. నాకెవరైనా ఐ లవ్ యు చెప్పారంటే నాకు దూరమైనట్లే.
♦ విచిత్రంగా ఉందే?
ఎవరైనా ఐ లవ్ యు చెబితే భయంగా ఉంటుంది. ఎందుకంటే, లవ్ పేరుతో జీవితాన్ని తారుమారు చేసేస్తారు. నా పిల్లలకు కూడా ‘ఐ లవ్ యు’ అనీ, ‘మిస్ యు’ అనీ చెప్పను. అవుట్ డోర్ షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు ‘మిమ్మల్ని చూడాలని ఉంది. త్వరగా వచ్చేస్తాను’ అంటూ ఫోన్లు చేయను. మా ఆవిడకు ఫోన్ చేసి, మాట్లాడతాను. అప్పుడు పిల్లలు మాట్లాడతానంటే మాట్లాడతాను. వాళ్లని మానసికంగా స్ట్రాంగ్‌గా చేయడం కోసమే ఇదంతా.
♦ అలా చేయడంవల్ల ఎలా స్ట్రాంగ్ అవుతారు?
నా పిల్లలు వాళ్ల లైఫ్‌ని వాళ్లు లీడ్ చేసుకునేంత స్ట్రాంగ్‌గా ఉండాలను కుంటాను. అందుకే, ఒకటో తరగతప్పుడే హాస్టల్లో చేర్చాను. హాస్టల్లో వాళ్ల దుప్పటి వాళ్లే మడతపెట్టుకోవాలి, వాళ్ల బకెట్ వాళ్లే తీసుకోవాలి, పేస్ట్ అయిపోతే పక్కవాణ్ణి అడగాలి. అలా అడగాలంటే పక్కవాడితో ఫ్రెండ్లీగా ఉండాలి. అమ్మా, నాన్నలకు దూరంగా ఉండటంవల్ల అలాంటివన్నీ అలవాటవుతాయి. ఇంట్లో ఉంటే.. ప్రతిదానికీ అమ్మా, నాన్న మీద ఆధారపడతారు. హాస్టల్లో ఉంటే అమ్మా, నాన్న గుర్తొచ్చినప్పుడు ఏడుస్తారు. ఆ ఏడుపు స్ట్రాంగ్ చేస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే.
♦ పిల్లల్ని హాస్టల్లో పెట్టడానికి మీ ఆవిడ ఒప్పుకున్నారా?
అర్థమయ్యేలా చెప్పాను. ఐదేళ్లు హాస్టల్లో ఉంచి, ఇంటికి తీసుకొచ్చాం. నేను అనుకున్నట్లుగానే పిల్లలు డీసెంట్‌గా తయారయ్యారు. నా పిల్లల్లో ఉన్న మంచీ, మర్యాద తాలూకు క్రెడిట్ అంతా మా ఆవిడకే దక్కుతుంది. ఒక్కోసారి షూటింగ్ లొకేషన్‌కి తీసుకు వచ్చి, ‘ఈరోజుకి నువ్వే ప్రొడక్షన్ బాయ్.. అందరికీ టీ ఇవ్వు’ అంటుంది. నా కొడుకు అందరికీ టీలు ఇస్తాడు. కష్టం విలువ నాకు తెలుసు. నా పిల్లలకు కూడా తెలియాలనుకుంటాను.
♦ మీరు దేవుణ్ణి అస్సలు నమ్మరనిపిస్తోంది.. చిన్నప్పట్నుంచీ అంతేనా?
చిన్నప్పుడు చాలా నమ్మకం. రామాయణం, భారతం, భగవద్గీత చదివాను. తెల్లవారు జాము నాలుగు గంటలకు నిద్ర లేచి దేవుడి పాటలు పాడేవాణ్ణి. మా ఊళ్లో ఎక్కడ సత్యనారాయణ వ్రతాలు జరిగినా నాతో దేవుడి పాటలు పాడించేవాళ్లు. కానీ, ఎనిమిదో తరగతి వచ్చేసరికి నమ్మకం పోయింది. దేవుడనేవాడు ఉన్నాడని నమ్ముతాను. కానీ, పూజలు చేయడం, మొక్కడం మానేశాను.
♦ కష్టాలొస్తే దేవుడికి చెప్పుకోవచ్చంటారు... మరి.. మీరెవరికి చెప్పుకుంటారు?
ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ దేవుడికి చెబితే, వింటాడనుకుంటే తప్పు. దేవుడి గురించి సరిగ్గా అర్థమైతే మనం ఏమీ అడగం. అన్నీ చేస్తాడనుకుని, మన పని మనం చేసుకుంటాం. దేవుడు మనల్ని లవ్ చేయడు.. అలాగని అసహ్యించుకోడు. కానీ, మనందర్నీ ప్రేమించే పని మీదే దేవుడి ఉంటాడనుకుంటాం.
♦ ఓకే... చిరంజీవితో అనుకున్న సినిమా స్టేటస్ ఏంటి?
చిరంజీవిగారు కథ రెడీ చేయమన్నారు. ఫస్టాఫ్ ఆయనకు నచ్చింది. సెకండాఫ్ చెప్పాను. నాగబాబు గారికి చెప్పమంటే చెప్పాను. ఆయనకు కథ బాగా నచ్చింది. దాంతో ‘మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెబుతారా’ అని చిరంజీవిగార్ని అడిగితే, ‘తర్వాత చెబుతా’ అన్నారు. కానీ, ఒకరోజు సెకండాఫ్ నచ్చలేదని మీడియాలో చెప్పారు. ‘ఈ కరెక్షన్స్ చేస్తే బాగుంటుంది’ అని నాకు చెబితే, నేను చేసేవాణ్ణి.
♦ కొంత విరామం తర్వాత చేయనున్న చిత్రం కావడంతో స్టోరీ సెలక్షన్ విషయంలో చిరంజీవిగారికి కొంచెం ప్రెజర్ ఉండి ఉంటుందేమో?
అది నిజమే. డెసిషన్ తీసుకునే విషయంలో కొంచెం ప్రెజర్ ఉంటుంది.
♦ ఈ సినిమాలో పెళ్లయినవాడిలా కనిపించాలా? పెళ్లి కానివాడిలా కనిపిస్తే బాగుంటుందా? అసలెలా కనిపించాలనే విషయం మీద కూడా ఆయనకు చాలా సందేహాలు ఉండి ఉండొచ్చేమో?
అవును. కానీ, ఇవన్నీ ఆలోచించి పక్కా కమర్షియల్ స్టోరీ రెడీ చేశాను. నా వరకు నాకా కథ అద్భుతంగా ఉంది. కానీ, ఆయన డెసిషన్ తీసుకోలేదు.
♦ ఒకవేళ ఇప్పుడు పిలిచి సినిమా చేయమంటే చేస్తారా?
చిరంజీవిగారితో సినిమా అంటే ఎందుకు చేయను? ఎప్పుడైనా రెడీ.
♦ కానీ, మీరు ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారని ఆ మధ్య రామ్‌చరణ్ మీడియాతో అన్నారు. బహుశా మీ బిజీ షెడ్యూల్ కారణంగా కూడా మీతో చేయాలని డెసిషన్ తీసుకోలేకపోతున్నారేమో?
‘టెంపర్’ తర్వాత నేను నాలుగు సినిమాలు కమిట్ అయ్యాను. అప్పుడే చిరంజీవిగారు పిలిచి అడిగారు. ఆయన మీద ఉన్న గౌరవంతో రెండు సినిమాలకు రెండు కోట్లు అడ్వాన్స్ తీసుకుని, తిరిగి ఇచ్చేశాను. ఆ సినిమాలు క్యాన్సిల్ చేసేశాను. కానీ, ఆయనకు కథ నచ్చలేదు. నిజానికి నేను బిజీగా ఉన్నప్పుడే నన్ను సినిమా చేసి పెట్టమని అడిగారు.
♦ పస్తుతం చేస్తున్న ‘లోఫర్’ కథ ఏంటి?
‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తర్వాత నేను తీసిన ఆ తరహా చిత్రమిది. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఉంటుంది.
♦ వరుణ్ తేజ్ నటన గురించి?
వరుణ్ ఎంత హైట్ ఉన్నా, తనలో ఓ ఇన్నోసెన్స్ కనిపిస్తుంది. పోను పోను అదే అందరికీ నచ్చుతుంది. వరుణ్ పెద్ద స్టార్ అవుతాడు. కచ్చితంగా నాగబాబుగారు గర్వంగా ఫీలయ్యేలా సెటిల్ అవుతాడు.
♦ మదర్ సెంటిమెంట్‌తో సినిమా తీసి, ‘లోఫర్’ అని పెట్టారేంటి?
సినిమా చూస్తే, ఈ టైటిలే కరెక్ట్ అని ఒప్పుకుంటారు. కానీ, అన్నయ్య (నిర్మాత సి. కల్యాణ్), రాంగోపాల్‌వర్మ టైటిల్ మార్చాలంటున్నారు.
♦ మీ గురువు రాంగోపాల్ వర్మ సెంటిమెంట్స్‌ని నమ్మరు కదా..?
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి, ‘నాకు మదర్, సిస్టర్, బ్రదర్ సెంటిమెంట్ అంటే అసహ్యం. అలాంటి సినిమాలు తీయను. కానీ కొన్ని సీన్స్ చూసి ఎమోషనల్ ఫీలయ్యాను’ అని, రాంగోపాల్ వర్మగా అమ్మ మీద ఓ ప్రోమో కట్ చేశారు. ఈ చిత్రం కోసం సుద్దాల అశోక్‌తేజ తెలంగాణ యాసలో రాసిన అమ్మ పాట కంట తడిపెట్టిస్తుంది.
♦ ఇడియట్, పోకిరి.. ఇప్పుడు ‘లోఫర్’.. ఆ తర్వాత ‘రోగ్’ టైటిల్‌తో సినిమా తీయనున్నారట.. ఈ యాంటీ టైటిల్స్ పెట్టడం అంత అవసరమా?
ఈ టైటిల్స్ వల్ల దేశానికి వచ్చిన నష్టమేంటి? ‘పోకిరి’ చిత్రాన్ని పదేళ్లుగా పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ఆఫీసర్స్కి చూపిస్తున్నారు. ‘బిజినెస్‌మేన్’ గురించి బిజినెస్ స్కూల్స్‌లో, మోటివేషన్ క్లాసుల్లో చెబుతుంటారు.
♦ వేగంగా సినిమాలు తీసే మీరు ‘బాహుబలి’ వంటి సినిమాలు తీస్తారా?
‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ చిత్రాలు ఇండస్ట్రీకి బలం. రెమ్యునరేషన్స్ పెరుగుతాయి.. బిజినెస్ పెరుగుతుంది. కానీ, నేను ‘బాహుబలి’ సినిమా చేయను. కావాలంటే ఓ వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని, ఆ సినిమా చూస్తాను. నాలుగైదు షేడ్స్‌లో స్టోరీ అంటే రెండు నెలల తర్వాత నాకే బోర్ కొట్టేస్తుంది. ఇక, ఆ స్క్రిప్ట్‌తో నెలల తరబడి ప్రయాణం అంటే కష్టం.
♦ కొంచెం వేగం తగ్గిస్తే, ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశం ఉంది కదా?
రెండేళ్లు స్క్రిప్ట్ చేసి, ఆ కథను రెండేళ్లు తెరకెక్కిస్తే మంచి సినిమాలు చేస్తానా? లేదా? నాకు తెలియదు. రెండు సంవత్సరాలనేది నాకు చాలా వేల్యూబుల్. నా టైమ్ వేస్ట్ చేసుకోను. ఎవరి టైమ్ వేస్ట్ చేయను.
♦ మీ తమ్ముడు సాయిరామ్ శంకర్ కెరీర్‌ని నిలబెట్టడానికి మీరు చాలా ప్రయత్నాలు చేసినా, ఇంకా సరైన బ్రేక్ రాకపోవడానికి కారణం?
ఒకళ్లని నిలబెట్టడం మన చేతుల్లో ఉండదు. మన దగ్గర డబ్బులుంటే పిల్లలకు ఇవ్వగలం కానీ, సక్సెస్‌ని ఇవ్వలేం. అది దానంతట అది రావాలి.
♦ మళ్లీ హిందీ సినిమా ఎప్పుడు?
డిస్కషన్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది చేస్తాను.
♦ ఈ మధ్య కొన్ని సినిమాలు అనౌన్స్ చేసి ఆగాయి. నితిన్‌తో సినిమా ఆగింది.. చిరంజీవితో సినిమా స్టేటస్ హోల్డ్‌లో ఉంది?
ఏవో చిన్న చిన్న తేడావల్ల అలా జరిగింది. పెద్ద పెద్ద కారణాలు లేవు.
♦ తదుపరి చిత్రాలు?
ఇషాన్ అనే కొత్త హీరోతో తెలుగు, కన్నడ భాషల్లో సినిమా చేయనున్నా. మహేశ్‌బాబు కోసం, అల్లు అర్జున్ కోసం కథలు రెడీ చేస్తున్నాను.
♦ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన మీలాంటి దర్శకులు వాళ్లతోనే కంటిన్యూ అవుతారు.. కానీ, మీరు కొత్త హీరోతో చేయడానికి కారణం?
ఒక్కోసారి స్టార్ హీరోలు ఫోన్ చేయని పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటప్పుడు సినిమాలు చేయడం ఆపకూడదు. ఎవరితో కుదిరితే వాళ్లతో సినిమాలు చేసేయడమే. ఖాళీగా లేకుండా ఉంటే చాలు.
- డి.జి. భవాని