మాజీ డీజీపీ అరవిందరావుకు ఊరట
సాక్షి, హైదరాబాద్: మాజీ డీజీపీ అరవిందరావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఐపీఎస్ అధికారి సుందర కుమార్ దాస్ ఫిర్యాదు ఆధారంగా అరవిందరావుపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సోమవారం కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎస్.వి.భట్టీలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అరవిందరావు అదనపు డీజీగా ఉన్న సమయంలో.. తాను ఎస్సీని కావడంతో సరైన పోస్టింగ్ ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారంటూ దాస్ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి.. అరవిందరావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ అరవిందరావు గత వారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.