డాబా శీనుపై పీడీ యాక్టు
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో పేరొందిన ఎర్రచందనం స్మగ్లర్ డాబా శీనుపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టును ప్రయోగిస్తూ కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బంగారుపాళ్యం మండలం చీకూరిపల్లెకు చెందిన శ్రీనివాసులు (34) అలియాస్ డాబా శీను ఎర్రచందనం స్మగ్లర్. పదో తరగతి వరకు చదువుకున్న అతను 2004 నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారంలో ఉన్నాడు. అతనిపై జిల్లాలో దాదాపు 51 కేసులు ఉన్నాయి. ఇటీవల అతణ్ని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న శీనుపై కలెక్టర్ ఆదేశాల మేరకు పీడీ యాక్టు ప్రయోగించి కడప కేంద్ర కారాగారానికి తరలించారు.