Dhandha
-
మళ్లీ మొదలైన మట్టి దోపిడీ
పట్టపగలే జోరుగా అక్రమ రవాణా మండలస్థాయి నాయకుడి అండదండా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం తాళ్లరేవులో మట్టి దోపిడీ మళ్లీ మొదలైంది. స్థానిక ఆత్రేయ గోదావరిలో డ్రెడ్జింగ్ ద్వారా తవ్వి తీసిన మట్టిని అక్రమార్కులు దర్జాగా తరలించుకుపోతున్నారు. పట్ట పగలే పొక్లెయి¯ŒS ద్వారా మట్టిని టిప్పర్లలో వేసి తరలిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకో వడం లేదు. మండల స్థాయి నాయకుని అండదండలతో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. – తాళ్లరేవు మురుగుకాలువల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.25 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆత్రేయ డ్రెయిన్ డ్రెడ్జింగ్ పనులను నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టింది. డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసిన మట్టిని గోదావరి చెంతన గట్లపైన, సమీప పల్లపు ప్రాంతాలలోనూ వేస్తున్నారు. ఈ మట్టిని గట్లపై వేయడం ద్వారా గోదావరి గట్లు పటిష్టమవుతాయని గోదావరి చెంతనగల రైతులు, ప్రజలు ఆనం దం వ్యక్తం చేశారు. అయితే గతంలో కొందరు అక్రమార్కులు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై లక్షలాది రూపాయల విలువైన మట్టిని దర్జాగా యంత్రాల సాయంతో తవ్వి లారీలు, టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ భాగోతంపై పలువురు ఫిర్యాదు చేయడంతో మట్టి తరలింపు నిలిచిపోయింది. అయితే రెండు రోజులుగా అక్రమార్కులు మళ్లీ మట్టి అక్రమ తరలింపునకు తెరతీశారు. నిత్యం అనేక టిప్పర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఏటిగట్టును ఛిద్రం చేస్తున్నారు ఆత్రేయ గోదావరి చెంతనే అనేక గ్రామాలు ఉన్నాయి. వాటితో పాటు వేలాది ఎకరాల వరి ఆయకట్టు ఉంది. వరదల సమయంలో ఆయా గ్రామాలకు, వరి ఆయకట్టుకు ఎటువంటి నష్టం కలుగకుండా ఏటిగట్లు కాపాడుతూ ఉంటాయి. అటువంటి గట్లను ఇష్టానుసారం తవ్వేసి అక్రమార్కులు మట్టిని తరలించుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఏటిగట్లను పటిష్టం చేస్తుంటే మరోపక్క ఏటిగట్లపై ఉన్న మట్టిని దర్జాగా తరలించుకు పోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తక్షణమే స్పందించి మట్టి అక్రమ తరలింపును నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
వారసుడి దోపిడి
తండ్రి పేరు చెప్పి తనయుడి దందా పేదల జాగాలపై పైసలేరుకుంటున్న పుత్రరత్నం పట్టాకు పక్కాగా రూ.30 వేల వసూలు ఇంటి స్థలం ఎక్కడ పోతుందోనని బెంగటిల్లుతున్న పేదలు అడిగినంతా ముట్టజెబుతున్న వైనం నాయకులు తమ పిల్లలకు ఆస్తులతోపాటు రాజకీయ వారసత్వం కూడా ఇస్తారని అందరికీ తెలుసు. కానీ కోనసీమలోని ఒక కీలక నేత రాజకీయ వారసత్వాన్నే కాకుండా పేదలను దోచుకునే వారసత్వాన్ని కూడా తనయుడికి అప్పగించినట్టున్నాడు. ఇదివరకు టీడీపీ పాలనలో పనికి ఆహారం పథకం బియ్యాన్ని ఆ నేత బొక్కేశాడు. ఇప్పుడు అతగాడి తనయుడి వంతు వచ్చింది. ఇళ్ల పట్టాల కేటాయింపు పేరుతో ఆ పుత్రరత్నం నిరుపేదలను పీక్కు తింటున్నాడు. పట్టాకో రేటు కట్టి.. అడిగినంతా ముట్టజెప్పాలంటూ దందా చేస్తున్నాడు. ఈ దందాగిరీకి కోనసీమలోని పి.గన్నవరం నియోజకవర్గం కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ : నియోజవర్గ కేంద్రమైన పి.గన్నవరంలోని తహసీల్దార్ కార్యాలయం రోడ్డు, చిట్లంకపేట, బోడపాటివారిపాలెం ప్రాంతాల్లోని ఆరెకరాల్లో 699 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఐదేళ్ల కిందటే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని అర్హతలూ ఉన్న 224 మందితో ఓ జాబితా కూడా తయారుచేశారు. అయినప్పటికీ ఆ స్థలాలు పల్లంగా ఉండటం, ఇంటి రుణాల మంజూరు తదితర కారణాలతో ఇప్పటివరకూ పట్టాల పంపిణీ జరగలేదు. కానీ, ఎంపిక చేసిన జాబితా మాత్రం రెవెన్యూ నుంచి గృహనిర్మాణ సంస్థకు వెళ్లింది. ఈ విషయం నియోజకవర్గంలోని ముఖ్యనేత పుత్రరత్నం దృష్టిలోకి వచ్చింది. ఆ జాబితాలో ఉన్నవారందరికీ ఇప్పుడు యథాతథంగా పట్టాలు ఇచ్చేస్తే తమకేం లాభమని ఆలోచించాడు. ఇంకేముంది! ఆ జాబితా దుమ్ము దులిపి డబ్బులు దండుకొనేందుకు అనుచరులతో కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. దండుకునే పథకం వేశాడిలా.. గత ప్రభుత్వ హయాంలో తయారైన జాబితాలో అవకతవకలున్నాయని, దీనిపై రీ సర్వే చేయాలని తన తండ్రి ద్వారా రెవెన్యూ అధికారులకు సిఫారసు చేయించాడు. అందుకు రెవెన్యూ యంత్రాంగం సై అంది. రీ సర్వే మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో ఆ పుత్రరత్నం ఆ జాబితా కాపీని తన అనుచరుల చేతిలో పెట్టాడు. వారు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తున్నారు. పట్టా కావాలంటే రూ.30 వేలు ఇవ్వాలంటూ బల వంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూపొందిన ఆ జాబితాలో ఉన్నవారిలో చాలామంది అప్పటి పాలక పక్షానికి చెందినవారే. జాబితాలో వారిని కొనసాగించాలంటే సొమ్ములు చేతిలో పెట్టాల్సిందేనని ముఖ్యనేత తనయుడి అనుచరులు హుకుం జారీ చేస్తున్నారు. తాజా జాబితా నుంచి కూడా దండుడు గతంలో మంజూరైన 224 పట్టాలకు తోడు ప్రస్తుతం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సిఫారసుతో మరో 450 మంది జాబితా తయారీలో రెవెన్యూ అధికారులున్నారు. ఇందులో కూడా ఆ ముఖ్యనేత తనయుడు నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే పథకాన్ని రచించాడు. ఒకవైపు అధికారులు సర్వే చేస్తూండగా, మరోవైపు ఆ పుత్రరత్నం వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టాడు. అతడి అనుచరులు పేదల వద్దకు వెళ్లి రూ.30 వేలు ఇస్తేనే జాబితాలో పేరుంటుందని, లేకుంటే స్థలం రాదని బెదిరించి మరీ దోచేస్తున్నారు. దీంతో తమకు ఎక్కడ స్థలం రాదోనన్న భయంతో పేదలు అప్పులు చేసి మరీ ఆ నేత తనయుడికి ముడుపులు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే వందమంది ఆ ముఖ్యనేత తనయుడి చేతిలో డబ్బులు పెట్టేశారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కితే స్థలం రాకుండా పోతుందని గట్టిగా హెచ్చరించడంతో వారంతా మిన్నకుండిపోతున్నారు. లక్ష్యం.. అక్షరాలా రూ.10 లక్షలు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల పట్టాల కేటాయింపునకు సంబంధించి, ప్రస్తుతం ఆ ముఖ్య నేత తనయుడి వసూలు లక్ష్యం రూ.10 లక్షలు. ఈ మొత్తాన్ని పేదల నుంచి గుంజేందుకుగానూ.. ఐదేళ్ల క్రితం 224 పట్టాలు పొందినవారిలో సగానికి పైగా అనర్హులేనని తమ అనుచరగణంతో బయట ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రచారంతో లబ్ధిదారులే తనవద్దకు పరుగెత్తుకు వచ్చి పట్టాలు రద్దు కాకుండా చూడాలంటూ ప్రాధేయపడతారన్నది అతగాడి వ్యూహం. ఇది పక్కాగా వర్కవుట్ అయ్యింది. ప్రస్తుతం పి.గన్నవరం పరిసర ప్రాంతాల్లో సెంటు భూమి ధర రూ.లక్ష పైనే ఉంది. నాటి జాబితా ప్రకారం ఒక్కొక్కరికి రెండు సెంట్ల జాగా వస్తుంది. అంటే లబ్ధిదారులు పొందే స్థలం విలువ రూ.2 లక్షలన్న మాట. దీంతో రూ.30 వేలు సమర్పించుకున్నా రూ.2 లక్షల విలువైన స్థలం వస్తుందని లబ్ధిదారులు ఆశ పడుతున్నారు. సరిగ్గా దీనినే ముఖ్యనేత తనయుడు సొమ్ము చేసుకుంటున్నాడు. -
ప్రభాస్, కృష్ణంరాజుల 'దందా'
ప్రస్తుతం టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానానికి పోటీపడుతున్న స్టార్ హీరో ప్రభాస్. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. ప్రస్తుతం 'బాహుబలి 2' పనుల్లో బిజీగా ఉన్నాడు. మరో ఏడాది పాటు ఈ సినిమా మీద దృష్టి పెట్టనున్న ప్రభాస్, ఆ తరువాత ఏ సినిమా చేస్తాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలితో క్రియేట్ అయిన అంచనాలను మించే సినిమా చేస్తాడా..? లేక ఆ అంచనాలను తగ్గించే సింపుల్ సబ్జెక్ట్‌తో వస్తాడా..? అన్న చర్చ జరుగుతోంది. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించనున్న సినిమాలో ప్రభాస్ నటిస్తాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారికంగా ప్రకటన ఏమీ లేకపోయినా సుజిత్ మాత్రం మరో సినిమా అంగీకరించకుండా ప్రభాస్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. అదే సమయంలో పెదనాన్న కృష్ణంరాజు దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని భావిస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కృష్ణంరాజు దర్శకత్వంలో సినిమా ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా 'విశాల నేత్రాలు' నవలను సినిమాగా తెరకెక్కించాలని భావించినా తరువాత ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఛత్రపతి సినిమా తరువాత 'ఒక్కఅడుగు' పేరుతో తమ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ప్రకటించారు కృష్ణంరాజు. ఈ సినిమా కూడా కార్యరూపం దాల్చలేదు. తాజాగా తన సొంతం నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పై ప్రభాస్ హీరోగా 'దందా' అనే సినిమాను తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు కృష్ణంరాజు. బాహుబలి సినిమా పూర్తవ్వడానికి మరో ఏడాది సమయం పడుతుంది. ఏ సినిమా అయినా ఆ తరువాతే ప్రారంభించాలి. మరి సుజిత్ అప్పటి వరకు ప్రభాస్ కోసం ఆగుతాడా..? ప్రభాస్ కూడా సుజిత్ సినిమాకు అంగీకరిస్తాడా..? లేక పెదనాన్నతో సినిమాకే సై అంటాడా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరో ఏడాది పాటు వెయిట్ చేయాల్సిందే.