వారసుడి దోపిడి | son dhandha using father name | Sakshi
Sakshi News home page

వారసుడి దోపిడి

Published Mon, Oct 10 2016 12:06 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM

వారసుడి దోపిడి - Sakshi

వారసుడి దోపిడి

తండ్రి పేరు చెప్పి తనయుడి దందా
పేదల జాగాలపై పైసలేరుకుంటున్న పుత్రరత్నం
పట్టాకు పక్కాగా రూ.30 వేల వసూలు
ఇంటి స్థలం ఎక్కడ పోతుందోనని 
బెంగటిల్లుతున్న పేదలు
అడిగినంతా ముట్టజెబుతున్న వైనం
నాయకులు తమ పిల్లలకు ఆస్తులతోపాటు రాజకీయ వారసత్వం కూడా ఇస్తారని అందరికీ తెలుసు. కానీ కోనసీమలోని ఒక కీలక నేత రాజకీయ వారసత్వాన్నే కాకుండా పేదలను దోచుకునే వారసత్వాన్ని కూడా తనయుడికి అప్పగించినట్టున్నాడు. ఇదివరకు టీడీపీ పాలనలో పనికి ఆహారం పథకం బియ్యాన్ని ఆ నేత బొక్కేశాడు. ఇప్పుడు అతగాడి తనయుడి వంతు వచ్చింది. ఇళ్ల పట్టాల కేటాయింపు పేరుతో ఆ పుత్రరత్నం నిరుపేదలను పీక్కు తింటున్నాడు. పట్టాకో రేటు కట్టి.. అడిగినంతా ముట్టజెప్పాలంటూ దందా చేస్తున్నాడు. ఈ దందాగిరీకి కోనసీమలోని పి.గన్నవరం నియోజకవర్గం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ :
నియోజవర్గ కేంద్రమైన పి.గన్నవరంలోని తహసీల్దార్‌ కార్యాలయం రోడ్డు, చిట్లంకపేట, బోడపాటివారిపాలెం ప్రాంతాల్లోని ఆరెకరాల్లో 699 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఐదేళ్ల కిందటే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని అర్హతలూ ఉన్న 224 మందితో ఓ జాబితా కూడా తయారుచేశారు. అయినప్పటికీ ఆ స్థలాలు పల్లంగా ఉండటం, ఇంటి రుణాల మంజూరు తదితర కారణాలతో ఇప్పటివరకూ పట్టాల పంపిణీ జరగలేదు. కానీ, ఎంపిక చేసిన జాబితా మాత్రం రెవెన్యూ  నుంచి గృహనిర్మాణ సంస్థకు వెళ్లింది. ఈ విషయం నియోజకవర్గంలోని ముఖ్యనేత పుత్రరత్నం దృష్టిలోకి వచ్చింది. ఆ జాబితాలో ఉన్నవారందరికీ ఇప్పుడు  
యథాతథంగా పట్టాలు ఇచ్చేస్తే తమకేం లాభమని ఆలోచించాడు. ఇంకేముంది! ఆ జాబితా దుమ్ము దులిపి డబ్బులు దండుకొనేందుకు అనుచరులతో కలిసి మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు.
దండుకునే పథకం వేశాడిలా..
గత ప్రభుత్వ హయాంలో తయారైన జాబితాలో అవకతవకలున్నాయని, దీనిపై రీ సర్వే చేయాలని తన తండ్రి ద్వారా రెవెన్యూ అధికారులకు సిఫారసు చేయించాడు. అందుకు రెవెన్యూ యంత్రాంగం సై అంది. రీ సర్వే మొదలుపెట్టింది. సరిగ్గా ఇదే సమయంలో ఆ పుత్రరత్నం ఆ జాబితా కాపీని తన అనుచరుల చేతిలో పెట్టాడు. వారు ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తున్నారు. పట్టా కావాలంటే రూ.30 వేలు ఇవ్వాలంటూ బల వంతపు వసూళ్లకు తెగబడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో రూపొందిన ఆ జాబితాలో ఉన్నవారిలో చాలామంది అప్పటి పాలక పక్షానికి చెందినవారే. జాబితాలో వారిని కొనసాగించాలంటే సొమ్ములు చేతిలో పెట్టాల్సిందేనని ముఖ్యనేత తనయుడి అనుచరులు హుకుం జారీ చేస్తున్నారు.
తాజా జాబితా నుంచి కూడా దండుడు
గతంలో మంజూరైన 224 పట్టాలకు తోడు ప్రస్తుతం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి సిఫారసుతో మరో 450 మంది జాబితా తయారీలో రెవెన్యూ అధికారులున్నారు. ఇందులో కూడా ఆ ముఖ్యనేత తనయుడు నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే పథకాన్ని రచించాడు. ఒకవైపు అధికారులు సర్వే చేస్తూండగా, మరోవైపు ఆ పుత్రరత్నం వసూళ్ల పర్వానికి శ్రీకారం చుట్టాడు. అతడి అనుచరులు పేదల వద్దకు వెళ్లి రూ.30 వేలు ఇస్తేనే జాబితాలో పేరుంటుందని, లేకుంటే స్థలం రాదని బెదిరించి మరీ దోచేస్తున్నారు. దీంతో తమకు ఎక్కడ స్థలం రాదోనన్న భయంతో పేదలు అప్పులు చేసి మరీ ఆ నేత తనయుడికి ముడుపులు సమర్పించుకుంటున్నారు. ఇప్పటికే వందమంది ఆ ముఖ్యనేత తనయుడి చేతిలో డబ్బులు పెట్టేశారని సమాచారం. ఈ విషయం బయటకు పొక్కితే స్థలం రాకుండా పోతుందని గట్టిగా హెచ్చరించడంతో వారంతా మిన్నకుండిపోతున్నారు.
లక్ష్యం.. అక్షరాలా రూ.10 లక్షలు
గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇళ్ల పట్టాల కేటాయింపునకు సంబంధించి, ప్రస్తుతం ఆ ముఖ్య నేత తనయుడి వసూలు లక్ష్యం రూ.10 లక్షలు. ఈ మొత్తాన్ని పేదల నుంచి గుంజేందుకుగానూ.. ఐదేళ్ల క్రితం 224 పట్టాలు పొందినవారిలో సగానికి పైగా అనర్హులేనని తమ అనుచరగణంతో బయట ప్రచారం చేయిస్తున్నారు. ఈ ప్రచారంతో లబ్ధిదారులే తనవద్దకు పరుగెత్తుకు వచ్చి పట్టాలు రద్దు కాకుండా చూడాలంటూ ప్రాధేయపడతారన్నది అతగాడి వ్యూహం. ఇది పక్కాగా వర్కవుట్‌ అయ్యింది. ప్రస్తుతం పి.గన్నవరం పరిసర ప్రాంతాల్లో సెంటు భూమి ధర రూ.లక్ష పైనే ఉంది. నాటి జాబితా ప్రకారం ఒక్కొక్కరికి రెండు సెంట్ల జాగా వస్తుంది. అంటే లబ్ధిదారులు పొందే స్థలం విలువ రూ.2 లక్షలన్న మాట. దీంతో రూ.30 వేలు సమర్పించుకున్నా రూ.2 లక్షల విలువైన స్థలం వస్తుందని లబ్ధిదారులు ఆశ పడుతున్నారు. సరిగ్గా దీనినే ముఖ్యనేత తనయుడు సొమ్ము చేసుకుంటున్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement