విశిష్ట ఫలదాయకం ధనుర్మాస వ్రతం
ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దివ్యప్రార్థనకు అనువైన మాసం. ధనుర్మాసం అత్యంత పునీతమైనది. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తారు.
కాత్యాయనీ వ్రతం... పూజావిధానం
రోజులానే ముందు పూజ చేసుకోవాలి... ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం, గోదా అష్టోత్తరం చదువుకోవాలి... రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది... ముందుగా ప్రార్థన చదవాలి...ఆ తరువాత వరుసగా తనయ చదవాలి...తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి... తనయ చదువుతూ తొమ్మిది, పది తనయలు రెండు సార్లు చదవాలి.. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి..ఆ తరువాత ప్రార్థన చదవాలి.. తరువాత గోదాదేవి తనయ చదవాలి..
ఆ తరువాత పాశురాలు చదవడం ప్రారంభించాలి.. పాశురాలు చదివేటప్పుడు మొదటి పాశురం రెండుసార్లు చదవాలి.. అలాS మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి... అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడిగా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను, చివరపాశురంలో ఒక లైను చదవాలి.. చివరగా గోదా హారతి చదవాలి.. మంత్రపుష్పం కూడా చదవాలి.. మళ్ళీ ఏ రోజు పాశురం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి... నైవేద్యం సమర్పించాలి (రోజూ పొంగలి, దద్ధోజనం, పరమాన్నం ఉండి తీరాలి.. .సమయం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు... కాని ఇవన్నీ సూర్యోదయానికి ముందే మొదలవాలి.
(డిసెంబర్ 16, శుక్రవారం నుంచి ధనుర్మాసం
ప్రారంభమైంది. భోగితో ముగుస్తుంది)
ఆమే – ఆండాళ్
శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగితేలినవారిని ‘ఆళ్వారులు’ అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.
కన్నెపిల్లలకు మేలు చేసే వ్రతం
వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.
ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలకీ‡్ష్మ అనుగ్రహం లభిస్తుందనీ. దరిద్రం దూరం అవుతుందనీ పెద్దలంటారు. ఈ మాసంలో రోజు బ్రహ్మముహూర్తంలో పాశురాలను పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవటం తథ్యమని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లీడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని ఆండాళ్ తల్లి పావన చరిత ద్వారా తెలుస్తుంది. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
ప్రతిరోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెలరోజులూ తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తిమేరకు విష్ణుప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణుకథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిచ్చి, ఆశీస్సులు అందుకోవాలి.
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి, తిరుప్పావై గాన, శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయకం కాగలదనీ ఆశిద్దాం.
ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?
ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దధ్యోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పు, మిరియాలలో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు?
రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యమూ జరపకూడదు.
తిరుప్పావై అంటే ఏమిటి?
తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ‘తిరు’ అంటే శ్రీ అని, ’పావై’ అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించాడు.
తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్రలేచి స్నానం చేయాలి.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్కు ఇష్టమైన పుష్పకైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.
– కూర్పు: డి.వి.ఆర్.