నిరాశ.. ఆ గాయకుడిని మింగేసింది
లుధియానా: ప్రముఖ పంజాబీ గాయకుడు ధరం ప్రీత్ సింగ్ (38 ) ఆత్మహత్య చేసుకున్నాడు. భటిండాలోని తన సొంత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని చనిపోయాడు. వృత్తిపరంగా రాణించలేకపోతున్నాననే మనస్తాపంతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆఫర్లు తగ్గిపోవడంతో బాగా డిప్రెషన్లో ఉన్నాడని ధరం ప్రీత్ తల్లి బల్వీందర్ కౌర్ చెబుతున్నారు. 'ఈ ఫ్యాన్ నా జీవితాన్ని మింగేసేలా ఉంది' అని తరచూ అనేవాడని ఆమె వాపోయారు.
అమృతసర్‌లో జరిగిన ఒక ప్రదర్శన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత సోమవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. ఆ సమయంలో అతని భార్య, పిల్లలు ఇంట్లో లేరని సమాచారం.
బిలాస్ పూర్ గ్రామంలోని పేద కుటుంబంలో పుట్టిన ధరంప్రీత్.. చిన్న తనం నుంచి గొప్పగాయకుడు కావాలని కలలు కనేవాడు. ఈ నేపథ్యంలో సంగీతంపై మంచి పట్టు సాధించాడు. సొంతంగా 15 ఆల్బంలను విడుదల చేశాడు. అతని పాటలు గ్రామీణులను బాగా ఆకట్టుకునేవి. 2010 లో విడుదలైన ఎమోషన్ ఆఫ్ హార్ట్ అనే ఆల్బం చివరిది. అప్పటినుంచి ఒక్క ఆల్బం కూడా విడుదల కాకపోవడంతో ధరం ప్రీత్ చాలా నిరాశకు గురయ్యాడు. కాగా వర్ధమాన గాయకుని హఠాన్మరణంతో పంజాబీ సంగీత ప్రపంచం నివ్వెరపోయింది. సోషల్ మీడియాలో సంతాప సందేశాలు వెల్లువెత్తాయి.