తెలుగువారి ఆగ్రహం ప్రమాదకరం
విజయవాడ, న్యూస్‌లైన్: తెలుగువారి ఆగ్రహం చాలా ప్రమాదకరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ విభజనవాదులు చెబుతున్నవన్నీ అవాస్తవాలు, వక్రీకరణలేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత అడుసుమిల్లి జయప్రకాష్ రచించిన ‘ధర్మాగ్రహం’ పుస్తకం గణాంకాలతో రుజువు చేస్తోందన్నారు. పీవీపీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో ధర్మాగ్రహం పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్టు సి.రాఘవాచారి ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలవారికి సమస్యలు ఉన్నాయని, అందర్నీ ఒకచోటకు చేర్చి సమస్యను పరిష్కరించాలే గానీ, విభజనకు ఇది సమయం కాదని చెప్పారు. విభజన ద్వారా వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేది అపోహ మాత్రమేనని స్పష్టంచేశారు. గ్రంథ రచయిత అడుసుమిల్లి జయప్రకాష్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన దేశ విచ్ఛినానికి దారితీసే ప్రమాదం తలెత్తుతుందని హెచ్చరించారు. 2009 డిసెంబర్ 9న రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత తాను అన్నిశాఖల నుంచి సమగ్ర సమాచారాన్ని సేకరించి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఈ పుస్తకం రూపొందించినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి. కోటేశ్వరమ్మ, పీవీపీ ఫౌండేషన్ సీఈఓ పీవీ ప్రసాదరావు, ప్రముఖ వైద్యుడు కామినేని పట్టాభిరామయ్య, రిటైర్డ్ న్యాయమూర్తి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.