'పదిమందిని కనండి.. దేవుడే చూసుకుంటాడు'
నాగ్‌పూర్: 'ప్రతి హిందువు పదిమందిని కనండి.. వారి భారం దేవుడు చూసుకుంటాడు' అని హిందూ ఆధ్యాత్మిక వేత్త వాసు దేవానంద సరస్వతీ అన్నారు. దేశంలో ఇంకా చాలా మంది హిందువులు కావాలని అభిప్రాయపడ్డారు. నాగ్‌పూర్‌లో ధర్మ సంస్కృతి మహాకుంభ పేరిట ఓ కార్యక్రమం జరుగుతోంది. దీనికి ఆరెస్సెస్ మద్దతిస్తోంది. ఈ కార్యక్రమంలో 'హిందువులను రక్షించండి' అనే నినాదంతో అక్కడికి వచ్చిన స్వామీజీలంతా హిందు కమ్యూనిటీ ఇప్పుడున్నదానికంటే రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ వేదికపై వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, జ్యోతిర్మట్కు చెందిన వాసు దేవానంద సరస్వతీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాసుదేవానంద మాట్లాడుతూ 'ఇద్దరు పిల్లల్నే కనాలనే నిబంధనను పక్కకు పడేయండి. దానికి బదులు పదిమందిని కనండి. వారి గురించి మీరేం భయపడకండి. వారి సంరక్షణను దేవుడు చూసుకుంటాడు. అలాగే, ప్రధాని నరేంద్రమోదీ గోహత్యల నిషేధంపై సత్వర నిర్ణయం తీసుకుంటే మంచిది' అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అసోం గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తదితరులు కూడా పాల్గొన్నారు.