ఎమ్మెల్యే పదవికి ధర్మాన రాజీనామా
హైదరాబాద్ : సమైక్యాంధ్రకు మద్దతుగా మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. క్విడ్ ప్రోకో కేసులో ధర్మాన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు ధర్మాన సొంత జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా పదవ రోజు కూడా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. రాజాం పట్టణంలో చిరు వ్యాపారులు బంద్ పాటిస్తున్నారు. ఉద్యమకారుల ఒత్తిడికి తలొగ్గి ఎట్టకేలకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు రాజీనామా చేసినా.. ఆయన తన రాజీనామాను స్పీకర్‌కు కాకుండా ముఖ్యమంత్రికి, పీసీసీ అధ్యక్షుడికి పంపటంపై సమైక్యవాదులు మండిపడుతున్నారు.
కాగా అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా వెళితే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. పదవులను కాపాడుకునే చర్యల్లో భాగంగా కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు కోండ్రు మురళీ, శత్రుచర్ల విజయరామరాజులు ఎమ్మెల్యేలతో మాట్లాడి సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. పైగా ఉద్యమకారుల ముట్టడి నుంచి తప్పించుకునేందుకు కృపారాణి, కోండ్రు మురళీలు తమ ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయించుకున్నారు.