వికటించిన ఐరన్ మాత్రలు
ధర్పల్లి : ఐరన్ మాత్రలు వికటించి 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో గురువారం విద్యార్థినులకు ఐరన్ మాత్రలు పంపిణీ చేశారు. ఏఎన్ఎంలు సుశీల, నాగమణి సూచించినట్లుగానే భోజనం చేసిన తర్వాతే విద్యార్థినులు మాత్రలు వేసుకున్నారు.
రాత్రి 7 గంటల సమయంలో కడుపునొప్పి, వాంతులు వంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. 22 మంది అస్వస్థతకు గురి కావడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ధర్పల్లి క్లస్టర్ ఆస్పత్రికి తరలించారు. స్టాఫ్ నర్సులు ఉమ, హప్రీన్లు చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి, సేవలందించారు. హెచ్ఈఓ కిషన్‌రావు, ఏఎన్ఎంలు గంగామణి, నాగమణితో పాటు ఎంఎల్ఓ లింగమయ్య విద్యార్థులను పరామర్శించారు.
డాక్టర్లే లేరు
ధర్పల్లి ప్రభుత్వ క్లస్టర్ ఆస్పత్రిలో రాత్రి వేళల్లో డ్యూటీ డాక్టర్ ఉండాలి. అయితే ఐరన్ మాత్రలతో అస్వస్థతకు గురి అయిన వారిని ఆస్పత్రికి తరలించినప్పుడు డాక్టర్ ఒక్కరు కూడా లేక పోవటంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ఆస్పత్రికి చెందిన ఉద్యోగులు వెంటనే మెడికల్ ఆఫీసర్ స్వాతికి సమాచారం అందించారు. ఆమె జిల్లా కేంద్రం నుంచి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. మాత్రల్లో లోపం లేదని, భోజనం చేయకుండా మాత్రలు వేసుకున్నందునే అస్వస్థతకు గురై ఉంటారని వైద్యురాలు తెలిపారు. ఎలాంటి ప్రమాదమూ ఉండదని పేర్కొన్నారు.