అప్పన్న దూరదర్శన్
సింహాచలం అప్పన్న నిజరూపదర్శన భాగ్యం కలిగేది ఒకే ఒక్క రోజు.. ఏడాదంతా చందన శోభితుడైన సింహాచలేశుడు.. ఆ గంధపు పూత నుంచి బయల్వెడలి నిజరూప దర్శనం కల్పించేరోజు. అది చందనోత్సవం రోజు. అంత శుభప్రదమైన దినాన దురదృష్టం కొద్దీ సింహాచల ఆలయ అధికారుల నిజ(స్వ)రూపం బట్టబయలై భక్తులను ఆవేదనకు గురి చేసింది. ఆలయ అధికారులు, దళారులు ఇదే తడవుగా చందనస్వామి దర్శనాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం.. నిష్కర్షగా చెప్పాలంటే అయినకాడికి డబ్బులు దండుకోవడం భక్తజనకోటికి మనోక్లేశాన్ని మిగిల్చింది. సంపన్నులకు, అస్మదీయులైన వీఐపీలకు దగ్గరుండి అంతరాలయ దర్శనాలు చేయించిన అధికారులు, దళారులు.. సామాన్యభక్తులకు ‘దూరదర్శన’ భాగ్యం మాత్రమే కల్పించడం విమర్శలకు తావిచ్చింది. 20 అడుగుల దూరం నుంచి కేవలం లిప్తపాటు దర్శనం కల్పించిన అధికారుల తీరు సర్వదా ఖండనలను పాత్రమైంది. అయితేనేం.. ఏదైనా తమకేంటన్న అధికారుల తీరు మారకపోవడమే విస్తుగొలిపింది.
– సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఏ దేవాలయంలోనైనా మూలమూర్తి ఏడాదంతా ఒకే రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ ఏడాదంతా చందనపు పూతల చాటున ఉంటూ నిత్యరూపంతో పూజలందుకునే సింహగిరిపై కొలువైన వరాహ లక్ష్మీనృసింహస్వామి వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం నిజరూపంలో సాక్షాత్కరిస్తారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా నిజరూపాన్ని దర్శించి తరించేందుకు లక్షలాది మంది భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచే సింహాచలం చేరుకున్నారు.
మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి ఆలయ అధికారులు కేవలం లిప్తపాటు మాత్రమే దర్శనానికి అనుమతినివ్వడం, భక్తులతో అనుచితంగా ప్రవర్తించడం, వీఐపీలకు, దళారులకు మాత్రమే అంతరాలయ దర్శన ఏర్పాట్లు చేయడంతో ఈ ఏడాది కూడా ఆలయనిబంధనలకు, భక్తుల మనోభావాలకు విరుద్ధంగా చందనోత్సవ నిర్వహణ జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఆలయ వంశపారంపర్య అనువంశిక ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోకగజపతిరాజు దంపతులు, కుటుంబసభ్యుల తొలి దర్శనం తర్వాత అర్ధరాత్రి 2.15 గంటలకు భక్తులకు దర్శనాలు ప్రారంభించారు. మంగళవారం రాత్రి నుంచే క్యూల్లో ఉన్న భక్తులను దర్శనానికి అనుమతిస్తూనే ఒక్కసారిగా వీఐపీల గేట్లు తెరిచేశారు.
ప్రొటోకాల్‌కు విరుద్ధంగా.. ’గంట’లసేపు
మంత్రులు, న్యాయమూర్తులు, ఐఏఎస్ అధికారులు, వీఐపీలు తదితర ప్రముఖులకు ఉదయం 5 నుంచి 6 గంటల వరకు అనుమతిస్తామని స్వయంగా మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఈవో చంద్రమోహన్ కొద్దిరోజులుగా ప్రకటిస్తూ వచ్చారు. చందనోత్సవం రోజు వచ్చేసరికి ప్రొటోకాల్ నిబంధనలన్నీ గాల్లోకి ఎగిరిపోయాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచే ప్రొటోకాల్ దర్శనాలు మొదలైపోయాయి. దీంతో రూ.500, రూ.200లు టికెట్లు కొనుక్కొని క్యూల్లో నిలుచున్న భక్తులకు కష్టాలు మొదలయ్యాయి. ఆయా టికెట్లకు తొందరగానే దర్శనం అందుతుందని చెప్పిన అధికారులు తీరా ప్రొటోకాల్ దర్శనాల దెబ్బకు మూడు, నాలుగు గంటలపైనే పట్టింది.
ఇక ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు తెల్లవారుజామున 3 గంటలకు పది వాహనాల్లో సుమారు 70 మందినిపైగా తీసుకుని వచ్చి ఆలయంలో హల్చల్ చేశారు. దాదాపు గంటకు పైగా ఆయన ఆలయంలోనే ఉండిపోవడంతో క్యూలైన్లన్నీ స్తంభించిపోయాయి. ఆయన ఆలయంలో ఉన్నంతసేపు క్యూలైన్లు కదల్లేదు. ఆ తర్వాత గంటా సతీమణి ఓ 30 మందిని తీసుకుని ఆలయంలోకి వచ్చారు. అప్పుడు కూడా సామాన్య భక్తుల క్యూలైన్లు నిలిచిపోయాయి. ప్రొటోకాల్ దర్శనాల వేళలకు ముందుగానే అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ ఓ మంది అనుచరులతో వచ్చి ఆలయంలో హడావుడి చేశారు.
సామాన్య భక్తులకు లిప్తకాలం.. ఆలయ సిబ్బంది దూషణ పర్వం
సింహాచలం అప్పన్న ఆలయ ఆచారాలకు విరుద్ధంగా భక్తులకు ఈసారి కేవలం ఒకటి రెండు సెకన్ల పాటే దర్శనం కల్పిస్తూ అధికారులు, ఆలయ సిబ్బంది ఓవర్ యాక్షన్ చేశారు. లఘుదర్శనం అని ప్రకటించినప్పటికీ ఎంతోదూరం నుంచి వచ్చిన భక్తులను అర నిమిషం కాదు కదా.. పదిసెకన్లు కూడా దర్శనానికి అనుమతివ్వకుండా లాగిపడేశారు. ఒకింత వారించిన భక్తులపై సిబ్బంది దూషణ పర్వానికి దిగారు. స్వామి వారి విగ్రహం ఎదురుగూండానే పత్రికల్లో రాయలేని భాష పదేపదే ప్రయోగిస్తూ ఆలయ సిబ్బంది సామాన్యభక్తులపై ప్రతాపం చూపించారు.
డిప్యుటేషన్ సిబ్బంది ఎక్కడ?
చందనోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి 150 మంది దేవాదాయ, ధర్మాదాయశాఖ ఉద్యోగులు డెప్యూటేషన్‌పై ఇక్కడకు వచ్చారు. విధి నిర్వహణలో మాత్రం వారు ఎక్కడున్నారు.. ఏం చేశారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. విధుల కేటాయింపులో పక్కా ప్రణాళిక లేకపోవడంతో చాలా మంది విధులు నిర్వర్తించకుండా ఎవరి పనివారు చూసుకున్నారన్న వాదనలు ఉన్నాయి, పర్యవేక్షించాల్సిన ఈవో రామచంద్రమోహన్ వీఐపీల సేవలో తరించడం, మిగిలిన అధికారులు ప్రొటోకాల్ సేవల్లో మునిగిపోవడంతో డిఫ్యూటేషన్ సిబ్బంది ‘â¶పని’తనం గురించి పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.
రూ. వెయ్యి టిక్కెట్లు ఎన్ని?
వెయ్యి రూపాయల వీఐపీ టికెట్లను ఈసారి 8 వేలు ముద్రించామని, బ్యాంకుల్లోనే విక్రయాలు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఆ మేరకు బ్యాంకుల్లో మంగళవారం సాయంత్రం వరకు విక్రయాలు చేశారు. బుధవారం ఆయా టికెట్లు తీసుకొచ్చిన వారి సంఖ్య 15 వేల మందికిపైగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 8 వేల టికెట్లు ముద్రిస్తే 15 వేల మంది ఎలా వచ్చారు.. బ్లాక్‌లో టికెట్ల విక్రయాలు పక్కనపెడితే ఎవరైనా నకిలీ టికెట్లు ముద్రించారా... అధికారులకు తెలిసే ఇదంతా జరిగిందా.. అన్న వాదనలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి, ఈ టికెట్లపై స్వయంగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
తీరుమారని రామచంద్ర?
అప్పన్న ఆలయ కార్యనిర్వహణాధికారిగా కె.రామచంద్రమోహన్ ఐదేళ్లుగా ఇక్కడే పాతుకుపోయారు. వాస్తవానికి రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఓ ఈవో ఐదేళ్లపాటు నిరాటంకంగా కొనసాగడం అనేది ఎక్కడా లేదు.. కానీ రామచంద్రమోహన్ శైలే వేరు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ముఖ్యనేతల అడుగులకు మడుగులొత్తుతూ నిరాటంకంగా ఐదేళ్లుగా ఉన్నారంటేనే ఆయన పైరవీల ప్రతిభ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. ఎన్ని విమర్శలు వచ్చినా చలించని ఈవో ఈ ఏడాది మాత్రం విమర్శలకు తావివ్వకుండా దర్శన ఏర్పాట్లు చేస్తామని ప్రకటిస్తూ వచ్చారు. కానీ చందనోత్సవం రోజు వచ్చిసరికి తనదైన రీతినే కొనసాగించారు. యథావిధిగా వీఐపీల సేవలోనే తరించారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వేళ కాని వేళల్లో వీఐపీలను గంటల తరబడి అనుమతించారు. సర్వదర్శనానికి, టికెట్లు కొనుగోలు చేసి వచ్చిన భక్తులకు అవసరమైన ఏర్పాట్ల గురించి కనీసమాత్రంగా కూడా పట్టించుకోలేదు.