నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రలు
నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రలు
Published Mon, Mar 6 2017 10:30 PM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
దివ్యదర్శన యాత్ర ప్రారంభం
దేవాదాయ శాఖ ఆర్‌జేడీ చంద్రశేఖర్‌అజాద్
అడ్డతీగల (రంపచోడవరం) : దివ్యదర్శన యాత్ర ద్వారా నిరుపేద గిరిజనులకు తీర్థయాత్రల భాగ్యం కల్పిస్తున్నట్టు దేవాదాయ ధర్మాదాయశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు ఎస్‌ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. నిరుపేద భక్తులకు దేవాదాయశాఖ కల్పించిన ఉచిత తీర్థయాత్ర సదుపాయాన్ని జిల్లాలోనే ప్రథమంగా సోమవారం అడ్డతీగల నుంచి ఆర్‌జేడీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకసారి ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తే అధ్యాత్మిక అనుభూతితో సమాజ హితానికి తోడ్పడడానికి కట్టుబడి తోటి వారిని ఉత్తేజపర్చాలనే బృహత్తర సంకల్పాన్ని పాదుకొల్పాలనేది దివ్యదర్శన యాత్ర లక్ష్యమన్నారు. ఈ యాత్ర నాలుగు నుంచి ఐదు రోజులు ఉంటుందన్నారు. జిల్లా నుంచి 18 నుంచి 70 ఏళ్ల ఆరోగ్యవంతులు ఏడాదికి 10 వేల మంది వరకూ రాష్ట్రంలోని 9 పెద్ద దేవాలయాల దర్శనం కల్పిస్తామని ఆర్‌జేడీ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ఒకే కుటుంబంలో అత్యధికంగా ఐదుగురు వరకూ వెళ్లవచ్చన్నారు. ప్రతి వారం ఒక మండలంలో ఉన్న 200 మంది నిరుపేదలకు దివ్యదర్శన యాత్రలో భాగస్వాములను చేస్తామని ఆర్‌జేడీ చెప్పారు. యాత్రలో భక్తులు చేయకూడని పనులను ఆయన వివరించారు. భక్తులు, దేవాదాయశాఖ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందితో దీక్షా ప్రమాణం చేయించారు. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబుతో కలిసి జెండా ఊపి యాత్ర ప్రారంభించారు. గోవిందనామస్మరణతో భక్తులు దివ్యదర్శన యాత్రకు బయలుదేరారు. హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ జిల్లా కన్వీనర్ తణుకు వెంకటరామయ్య, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్లు సతీష్‌కుమార్, శ్రీనివాస్, రామలింగేశ్వరరావు, ఇతర సిబ్బంది, సమరసత సేవా ఫౌండేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement