రేపిస్టుకు రెండేళ్లపాటు శిక్ష తగ్గింపు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన దౌలాఖాన్ సామూహిక లైంగిక దాడికేసులో నిందితులకు రెండేళ్లపాటు శిక్షను తగ్గిస్తూ ఢీల్లీ హైకోర్టు శనివారం తీర్పు చెప్పింది. 2005లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినిపై నడుస్తున్న కారులో నిందితులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ట్రయల్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధించగా, ఈ శిక్షను 12 ఏళ్లకు తగ్గించింది. ఈ కేసులో నిందితుడు అజిత్ సింగ్ కత్యార్కు జైలు శిక్షతోపాటు రూ. 20,000లను విధిస్తూ డిసెంబర్ 9, 2005లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ప్రతిభా రాణి కేసు పూర్వాపరాలను పరిశీలించి శిక్షను తగ్గించాలని ఆదేశించింది. ఈ కేసులో నేరస్తుడు క్రూరంగా ప్రవర్తించినట్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని పేర్కొన్నారు. అంతేగాక సహనిందితులైన మరో ముగ్గురిని పోలీసులు ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. ఒకే నిందితుడికి ఈ శిక్షను ఎలా అమలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.