గోదావరిలో వరద పరవళ్లు
కొవ్వూరు: గోదావరి వరద పరవళ్లు తొక్కుతుంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీరు క్రమేణా పెరుగుతుండడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఇన్‌ప్లో పెరుగుతుంది.మంగళవారం ఉదయం ఆరుగంటలకు 2,44,026 క్యూసెక్కుల ఉన్న ఇన్‌ఫ్లో సాయంత్రం ఆరుగంటలకు 3,26,306 క్యూసెక్కులకు పెరిగింది.ఎగువన భద్రచలం వద్ద మధ్యాహ్నాం మూడు గంటలను వరద 37.80 అడుగుల వద్ద నిలకడ ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.దీనికితో భద్రచలం ఎగువ ప్రాంతాలైన కాలేశ్వరం, పేరూర్లో నీటిమట్టం స్వల్పంగా పెరుగుతుందన్నారు.ఈ నేపధ్యంలో బుధవారం ఉదయం నుంచి ధవళేశ్వరం ఆనకట్ట వద్ద వరద తీవ్రత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.రానున్న రెండు రోజుల్లో ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే వరద తీవ్రత మరింత పెరగవచ్చునని అధికారులు భావిస్తున్నారు.పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని లోతట్టు ప్రాంతంలో ఉన్న కాజ్‌వేలపై వరదనీరు చే రే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.భద్రచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక స్ధాయి(43అడుగులు) దాటితే ఈ మూడు మండలా ల్లో ఏజన్సీ ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది.ప్రస్తుతం భద్రచలంలో నీటిమట్టం నిలకడ ఉన్నప్పటికీ ఎగువ నుంచి వచ్చే వరద కారణంగా నీటిమట్టం పెరిగే సూచనలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.ఉభయ గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలో ఇప్పటికే తూర్పు డెల్టా కాలువకి పూర్తిగా నీటివిడుదల నిలిపివేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ డెల్టాకి 500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 1,000 క్యూసెక్కుల చోప్పున నీటిని విడిచిపెడుతున్నారు.కొవ్వూరు గోష్పాదక్షేత్రం లో స్నానఘట్టాల వద్ద వరద పరవళ్లు తొక్కుతుంది.కింది వరుసలో ఉన్న మెట్లు పూర్తిగా వరదముంపు గురయ్యాయి.
డెల్టాకాలువలకు నీటి విడుదల కుదింపు:
పశ్చిమ డెల్టా కాలువ ఆయకట్టు పరిధిలోని ఉండి కాలు, గోస్తనీ అండ్ వయ్యేరు కాలువలకు నీటి విడుదల నిలిపివేశారు.ఏలూరు కాలువకి 379 క్యూసెక్కులు, నరసాపురం కాలువకి 304, అత్తిలి కాలువకి 208 క్యూసెక్కుల చోప్పున సాగునీటిని విడుదల చేస్తున్నారు.
ఎగువన స్వల్పంగా పెరుగుతున్న నీటిమట్టాలు:
గోదావరికి ఎగువ ప్రాంతాల్లో నీటిమట్టాలు స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ మధ్యహ్నాం మూడు గంటల నుంచి భద్రచలంలో నిలకడగా కొనసాగుతుంది. సోమవారం కంటే మంగళవారం నీటిమట్టాల పెరుగుదల కనిపించింది. కాలేశ్వరంలో 9.80 మీటర్లు, పేరూరులో 10.69, దుమ్ముగూడెంలో 10.46, కూనవరంలో 12.52, కుంటలో 4.47, కొయిదాలో 16.26, పోలవరంలో 10.37, రోడ్డు కం రైలువంతెన వద్ద 14.02 మీటర్లు చోప్పున నీటిమట్టాలు నమోదయ్యాయి