27న ఆర్జియో 4జీ సేవల ఆవిష్కరణ
► ముందుగా రిలయన్స్ గ్రూప్ ఉద్యోగులకే సర్వీసులు
► వ్యవస్థాపకుడు ధీరూభాయ్ జయంతి సందర్భంగా కానుక
న్యూఢిల్లీ: టెలికం సంస్థ రిలయన్స్ జియో (ఆర్జియో) ఈ నెల 27న తమ 4జీ సేవలను ఆవిష్కరించనుంది. ఆ రోజున వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జయంతి సందర్భంగా ముందుగా గ్రూప్ ఉద్యోగుల కోసం వీటిని ప్రారంభించనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ తెలిపారు. జయంతి వేడుకలకు సంబంధించి సిబ్బందికి పంపిన ఆహ్వాన పత్రంలో వారు ఈ విషయాలు పేర్కొన్నారు. డిసెంబర్ 27న జరిగే కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
‘దేశవ్యాప్తంగా వెయ్యి పైగా ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. రిలయన్స్ కుటుంబంలోని ప్రతీ ఒక్కరు వ్యక్తిగతంగా లేదా జియో టెలికం సర్వీసుల ద్వారా వర్చువల్గానైనా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నాం’ అని వారు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ నెల 28న వాణిజ్యపరంగా 4జీ సర్వీసులు ప్రారంభం కాగలవన్న అంచనాలు ఉన్నాయి. ఏ తరహా టెక్నాలజీనైనా వినియోగించుకుని టెలికం సర్వీసులు అందించగలిగేంతగా ఆర్జియో వద్ద వివిధ బ్యాండ్విడ్త్లలో ఏకంగా 751.1 మెగాహెట్జ్ స్పెక్ట్రం ఉంది.