Dhokla
-
పెసర పప్పు రుచులు.. డోక్లా, దాల్ కచోరి ఇలా ఇంట్లోనే ఈజీగా!
Recipes In Telugu: వేసవి కాలంలో ఎంతో చలువ చేసే పెసర పప్పుతో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. మండే ఎండల్లో పెసర పప్పుని మరింత రుచికరంగా వండుకుని ఎలా ఆస్వాదించవచ్చో చూద్దాం... డోక్లా కావలసినవి: పొట్టుతీయని పెసరపప్పు – కప్పు, అల్లం – అంగుళంన్నర ముక్క, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను, ఆయిల్ – టేబుల్ స్పూను, నిమ్మరసం – టేబుల్ స్పూను, బేకింగ్ సోడా – అరటీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు, వేయించిన నువ్వులు – టీస్పూను. తాలింపు కోసం: ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు, ఆవాలు – అర టీస్పూను, జీలకర్ర – ఆరటీస్పూను, ఇంగువ – చిటికెడు, కరివేపాకు – రెండు రెమ్మలు. తయారీ: ►పెసర పప్పుని శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి. ►నానిన పప్పుని నీళ్లు వంపేసి కొత్తిమీర తరుగు వేసి బరకగా రుబ్బుకోవాలి. ►మందపాటి పాత్రలో రెండున్నర కప్పులు నీళ్లు పోసి..మెటల్ స్టాండ్ పెట్టాలి. ►ఈ స్టాండ్‌పై ఒక వెడల్పాటి పాత్రనుపెట్టి అడుగున ఆయిల్ రాయాలి. ►పప్పు రుబ్బులో అల్లం, పచ్చిమిర్చిని దంచి వేయాలి. కొద్దిగా ఆయిల్, నిమ్మ రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో అరటీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి, ►ఆయిల్ రాసి పెట్టుకున్న పాత్రలో వేసి ఆవిరి మీద ఇరవై నిమిషాల పాటు ఉడికించి దించేయాలి. ►బాణలిపెట్టి ఆయిల్ వేయాలి, ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి, జీలకర్ర, ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి. ►దీనిలో రెండు టేబుల్ స్పూన్లు నీళ్లుపోసి తిప్పి స్టవ్ ఆపేయాలి. ►ఆవిరి మీద ఉడికించిన పప్పుపైన ఈ తాలింపు వేయాలి. కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి, నువ్వులు చల్లి, ముక్కలుగా కట్ చేస్తే డోక్లా రెడీ. దాల్ కచోరి కావలసినవి: గోధుమ పిండి – రెండు కప్పులు, ఉప్పు – అర టీస్పూను, నెయ్యి – పావు కప్పు. స్టఫింగ్ కోసం: పొట్టుతీసిన పెసరపప్పు – అరకప్పు, నెయ్యి టేబుల్ స్పూను, పసుపు – పావు టీస్పూను, కారం – అర టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, సొంటిపొడి – అరటీస్పూను, ధనియాల పొడి – టీస్పూను, సోంపు – టీస్పూను, ఆమ్చూర్ పొడి – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి, తరువాత బరకగా రుబ్బి పక్కనపెట్టుకోవాలి. ►గోధుమ పిండిలో పావు కప్పు నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి అర టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన తరువాత పెసర పప్పు రుబ్బు జీలకర్ర, సొంటిపొడి, ధనియాలపొడి, సోంపు పొడి, ఆమ్‌చూర్‌పొడి, పసుపు, కారం వేసి కలపాలి. ►నాలుగు నిమిషాలు వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించి స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►చల్లారాక మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా వత్తుకుని మధ్యలో పెసరపప్పు ఉండ పెట్టి, పూర్తిగా కవర్ అయ్యేలా ఉండలా చుట్టుకోవాలి. ►ఈ ఉండని చిన్న కచోరిలా చేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే దాల్ కచోరి రెడీ. చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి? -
జెండా పండుగ వంటలు
స్వాతంత్య్ర దినోత్సవం... మువ్వన్నెల జెండా దేశమంతా రెపరెపలాడుతుంది. ఇంటింటా దేశభక్తి వెల్లివిరుస్తుంది. పిల్లలంతా మిఠాయిలు పంచుకుంటారు. మువ్వన్నెల వంటలు తయారు చేసి, జాతీయజెండాకు వందనం చేద్దాం. తిరంగా ఢోక్లా కావలసినవి: బియ్యం – 3 కప్పులు; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర కప్పులు; పుల్ల పెరుగు – కప్పు; అల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – అర టేబుల్ స్పూను; పుదీనా తరుగు – అర కప్పు; పచ్చి మిర్చి – 2; పసుపు – టీ స్పూను; మిరప కారం– టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; నువ్వులు – టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం, సెనగ పప్పులను విడివిడిగా శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి, విడివిడిగా సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి ∙నీరంతా ఒంపేసి మిక్సీలో వేసి విడివిడిగా గారెల పిండిలా ఉండేలా పట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙పుల్ల పెరుగు, కొద్దిగా వేడినీళ్లు జత చేసి బాగా కలిపి, మూత పెట్టి, ఆరుగంటలసేపు పిండిని వదిలేయాలి ∙మిక్సీలో పుదీనా, పచ్చి మిర్చి వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ∙నానిన పిండికి ఉప్పు, అల్లం తురుము జత చేయాలి ∙పిండిని మూడు సమాన భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగం పిండికి పసుపు, మిరప కారం జత చేయాలి ∙ఒక భాగానికి మెత్తగా చేసిన పుదీనా, పచ్చిమిర్చి ముద్ద జత చేయాలి ∙ఒక పాత్ర తీసుకుని నూనె పూయాలి ∙ముందుగా పుదీనా జత చేసిన మిశ్రమాన్ని సమానంగా వేసి, ఆవిరి మీద రెండు నిమిషాలు ఉడికించాలి ∙పాత్రను బయటకు తీసి, దాని మీద, తెల్లటి పిండి వేసి మళ్లీ ఆవిరి మీద ఉంచి రెండు నిమిషాల తరవాత ఆ పాత్రను బయటకు తీయాలి ∙పసుపు, మిరపకారం జత చేసిన మిశ్రమాన్ని సమానంగా పరిచి ఆవిరి మీద బాగా ఉడికించి దింపేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు వేసి చిటపటలాడాక నువ్వులు కూడా వేసి కొద్దిగా వేయించి తీసేసి, ఢోక్లా మీద సమానంగా పోయాలి. కాజు కట్లీ కావలసినవి: జీడి పప్పు – 2 కప్పులు; నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు; పాలు – టేబుల్ స్పూను; పంచదార పాకం కోసం; నీళ్లు – కప్పు; పంచదార – కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; ఫుడ్ కలర్ – ఆకుపచ్చ, ఆరెంజ్ రంగులు (చిటికెడు చొప్పున) తయారీ: ఒక పాత్రలో పంచదార, నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి పంచదార కరిగాక, ఏలకుల పొడి జత చేసి, ముదురు పాకం పట్టి పక్కన ఉంచాలి ∙జీడిపప్పును మిక్సీలో వేసి మధ్యమధ్యలో ఆపుతూ తిప్పి, ఆ పొడిని జల్లించాలి ∙ఇలా మొత్తం జీడిపప్పులను మిక్సీ పట్టి జల్లెడ పట్టి పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక, జీడిపప్పు పొడి వేసి దోరగా వేయించాలి ∙పంచదార పాకం జత చేసి సన్నటి మంట మీద ఆపకుండా కలుపుతుండాలి ∙బాగా దగ్గర పడి, అంచులను వదిలేస్తుండగా దింపేసి, కొద్దిగా చల్లారనివ్వాలి ∙చేతికి నెయ్యి రాసుకుని, పాలు జత చేసి, మెత్తగా అయ్యేవరకు కలిపి మూడు భాగాలుగా చేసుకోవాలి ∙ఒక భాగానికి ఆకు పచ్చ రంగు రెండు చుక్కలు, ఆరెంజ్ రంగు రెండు చుక్కలు విడివిడిగా కలిపి పక్కన ఉంచాలి ∙ముందుగా ఆకుపచ్చరంగు, ఆ తరవాత తెలుపు రంగు, చివరగా కాషాయ రంగు ఉంచి చేతితో జాగ్రత్తగా అదిమి, సుమారు పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తీసి, కావలసిన ఆకారంలో కట్ చేసుకోవాలి. కోకోనట్ గుల్కండ్ కావలసినవి: తెలుపు కోసం, తాజా కొబ్బరి తురుము – 3 అర కప్పులు; స్వీట్ కండెన్స్డ్ మిల్క్ – 3 పావు కప్పులు; గుల్కండ్ రోజ్ పెటల్ ప్రిజర్వ్ – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – మూడు టీ స్పూన్లు; ఎండు కొబ్బరి తురుము – రోలింగ్ కోసం తగినంత; క్యారట్ ముక్కలు – పావు కప్పు (మిక్సీలో వేసి మెత్తగా చేయాలి); ఆరెంజ్ ఫుడ్ కలర్ – కొద్దిగా; గ్రీన్ ఫుడ్‌కలర్ – కొద్దిగా. తయారీ: తెల్ల లడ్డు... స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక క్యారట్ ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కరిగాక కొబ్బరి తురుము వేసి, సన్నటి మంట మీద దోరగా (రంగు మారకుండా) వేయించాలి ∙కండెన్స్డ్ మిల్క్ జత చేసి, ఆపకుండా కలపాలి ∙అంచులు విడుతుండగా, దింపి చల్లారనిచ్చాక మూడు భాగాలు చేయాలి ∙ఒక భాగం నుంచి కొద్దిగా చేతిలోకి తీసుకుని, మధ్యలో కొద్దిగా గుల్కండ్ ఉంచి లడ్డూ మాదిరిగా చేసి, ఎండు కొబ్బరి పొడిలో దొర్లించి పక్కన ఉంచాలి (ఇలా తెలుపు లడ్లు సిద్ధం చేసుకోవాలి) ∙రెండో భాగానికి క్యారట్ మిశ్రమం, కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు చేసి, కొబ్బరి పొడిలో దొర్లించితే కాషాయ రంగు లడ్లు తయారైనట్లే ∙మూడో భాగానికి ఆకు పచ్చ ఫుడ్ కలర్ జత చేసి లడ్లు తయారుచేసుకుని, కొబ్బరి పొడిలో దొర్లించితే మువ్వన్నెల కోకోనట్ గుల్కండ్ రెడీ. -
వంటచేసి ఇస్తే.. వర్షం కురిపిస్తున్నాడుట!
అహ్మదాబాద్: నగరంలోని మెహందీ కువా ప్రాంతంలోని ఓ చిన్న మసీదుకు ఇప్పుడు భక్తులు క్యూ కడుతున్నారు. మసీదులో నివాసం ఉంటున్న డోకల్ బాబాకు డొక్లా(ప్రముఖ గుజరాతీ వంటకం)ను సమర్పిస్తే ఆయన వర్షాలు కురిపిస్తాడని చెప్తున్నారు. బాబా కోసం ప్రత్యేకంగా తయారుచేసిన డొక్లా వంటకంతో ఆయన్ను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతుండటంతో మసీదు చుట్టుపక్కల దుకాణాలు వెలిశాయి. 400 ఏళ్ల క్రితం అహ్మదాబాద్ నగరానికి పునాది రాళ్లు వేసిన 12 మంది సన్యాసుల్లో డొక్లా కూడా ఒకరని, ఈయన ఢిల్లీకి చెందిన క్వాజా నిజాముద్దీన్ అలియా శిష్యుల్లో ఒకరని చరిత్రకారులు చెప్తున్నారు. గత ఏడాది వర్షాలు లేకపోవడంతో నగరప్రజలు మసీదులోని డొకల్ బాబాకు పూజలు చేసి, ఆయనకు ఇష్టమైన డొక్లా వంటకాన్ని నైవేద్యంగా ఇచ్చి వర్షాలు కురవాలని ప్రార్ధనలు చేశారు. సంతోషించిన బాబా వర్షాలు కురవాలని చెప్పడంతో సీజన్ కు అవసరమైనన్ని వర్షాలు కురిశాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకూ బుతుపవనాలు నగరాన్ని తాకక పోవడంతో డొక్లా వంటకంతో ప్రజలందరూ మసీదు బాట పట్టారు. వర్షాలు కురిపించాలంటూ ప్రార్ధనలు చేస్తున్నారు. అలీ అనే భక్తుడు మాట్లాడుతూ.. వర్షాల కోసం ఈ ఏడాది బాబాను ప్రార్ధించామని త్వరలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. వర్షాలు లేకపోతే ఎక్కువగా ఇబ్బందులు పడేది పేద ప్రజలేనని అందుకే వర్షాలు కురవాలని వారందరూ బాబాను వేడుకుంటున్నారని తెలిపారు. డొక్లా వంటకానికి బాబాకు ఉన్న సంబంధం ఏంటో? తనకు తెలియదని, కానీ ఆ వంటకం చేసి బాబాకు నివేదిస్తే వర్షాలు కురుస్తాయని అన్నారు. కేవలం ముస్లింలే కాకుండా హిందూవులు కూడా బాబాకు పూజలు చేస్తున్నట్లు చెప్పారు.