పెసర పప్పు రుచులు.. డోక్లా, దాల్‌ కచోరి ఇలా ఇంట్లోనే ఈజీగా! | Recipes In Telugu: How To Make Dhokla And Dal Kachori At Home | Sakshi
Sakshi News home page

Dal Kachori: పెసర పప్పు రుచులు.. డోక్లా, దాల్‌ కచోరి ఇలా ఇంట్లోనే ఈజీగా!

Published Fri, Apr 8 2022 2:49 PM | Last Updated on Fri, Apr 8 2022 2:55 PM

Recipes In Telugu: How To Make Dhokla And Dal Kachori At Home - Sakshi

Recipes In Telugu: వేసవి కాలంలో ఎంతో చలువ చేసే పెసర పప్పుతో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. మండే ఎండల్లో పెసర పప్పుని మరింత రుచికరంగా వండుకుని ఎలా ఆస్వాదించవచ్చో చూద్దాం... 

డోక్లా
కావలసినవి:  పొట్టుతీయని పెసరపప్పు – కప్పు, అల్లం – అంగుళంన్నర ముక్క, పచ్చిమిర్చి – రెండు, కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను, ఆయిల్‌ – టేబుల్‌ స్పూను, నిమ్మరసం – టేబుల్‌ స్పూను, బేకింగ్‌ సోడా – అరటీస్పూను,  ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు – పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – పావు కప్పు, వేయించిన నువ్వులు – టీస్పూను. 
తాలింపు కోసం: ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – అర టీస్పూను, జీలకర్ర – ఆరటీస్పూను, ఇంగువ – చిటికెడు,  కరివేపాకు – రెండు రెమ్మలు. 

తయారీ:
పెసర పప్పుని శుభ్రంగా కడిగి రాత్రంతా లేదా ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి.
నానిన పప్పుని నీళ్లు వంపేసి కొత్తిమీర తరుగు వేసి బరకగా రుబ్బుకోవాలి.
మందపాటి పాత్రలో రెండున్నర కప్పులు నీళ్లు పోసి..మెటల్‌ స్టాండ్‌ పెట్టాలి.
ఈ స్టాండ్‌పై ఒక వెడల్పాటి పాత్రనుపెట్టి అడుగున ఆయిల్‌ రాయాలి.
పప్పు రుబ్బులో అల్లం, పచ్చిమిర్చిని దంచి వేయాలి. కొద్దిగా ఆయిల్, నిమ్మ రసం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. దీనిలో అరటీస్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి కలిపి, ఆయిల్‌ రాసి పెట్టుకున్న పాత్రలో వేసి ఆవిరి మీద ఇరవై నిమిషాల పాటు  ఉడికించి దించేయాలి.
బాణలిపెట్టి ఆయిల్‌ వేయాలి,  ఆయిల్‌ వేడెక్కిన తరువాత ఆవాలు వేసి చిటపటలాడనిచ్చి, జీలకర్ర, ఇంగువ కరివేపాకు వేసి వేయించాలి.
దీనిలో రెండు టేబుల్‌ స్పూన్లు నీళ్లుపోసి తిప్పి స్టవ్‌ ఆపేయాలి.
ఆవిరి మీద ఉడికించిన పప్పుపైన ఈ తాలింపు వేయాలి. కొత్తిమీర తరుగు, పచ్చికొబ్బరి, నువ్వులు చల్లి, ముక్కలుగా కట్‌ చేస్తే డోక్లా రెడీ. 

దాల్‌ కచోరి 
కావలసినవి:  గోధుమ పిండి – రెండు కప్పులు, ఉప్పు – అర టీస్పూను, నెయ్యి – పావు కప్పు. 
స్టఫింగ్‌ కోసం: పొట్టుతీసిన పెసరపప్పు – అరకప్పు, నెయ్యి టేబుల్‌ స్పూను, పసుపు – పావు టీస్పూను, కారం – అర టీస్పూను, జీలకర్ర – అరటీస్పూను, సొంటిపొడి – అరటీస్పూను, ధనియాల పొడి – టీస్పూను, సోంపు – టీస్పూను, ఆమ్‌చూర్‌ పొడి – టీస్పూను, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్‌ – డీప్‌ ఫ్రైకి సరిపడా. 

తయారీ: ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి రెండు గంటలపాటు నానబెట్టి, తరువాత బరకగా రుబ్బి పక్కనపెట్టుకోవాలి.
గోధుమ పిండిలో పావు కప్పు నెయ్యి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోని పక్కన పెట్టుకోవాలి.
స్టవ్‌ మీద బాణలి పెట్టి అర టేబుల్‌ స్పూను నెయ్యి వేయాలి.
వేడెక్కిన తరువాత పెసర పప్పు రుబ్బు జీలకర్ర, సొంటిపొడి, ధనియాలపొడి, సోంపు పొడి, ఆమ్‌చూర్‌పొడి, పసుపు, కారం వేసి కలపాలి.
నాలుగు నిమిషాలు వేగాక రుచికి సరిపడా ఉప్పు వేసి మరో ఐదు నిమిషాలు వేయించి స్టవ్‌ ఆపేసి చల్లారనివ్వాలి.
చల్లారాక మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని చపాతీలా వత్తుకుని మధ్యలో పెసరపప్పు ఉండ పెట్టి, పూర్తిగా కవర్‌ అయ్యేలా ఉండలా చుట్టుకోవాలి.
ఈ ఉండని చిన్న కచోరిలా చేసి బంగారు వర్ణంలోకి మారేంత వరకు ఆయిల్లో డీప్‌ ఫ్రై చేస్తే దాల్‌ కచోరి రెడీ.  

చదవండి: అవును... నాకు బట్టతలే.. అయితే ఏంటి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement