దళితులపై దాడి హేయం
డీహెచ్‌పీఎస్ జిల్లా కార్యదర్శి కనకరాజుప్రసాద్
కొరిటెపాడు: దళితులపై దాడులు చేస్తే సహించేది లేదని దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్‌పీఎస్) జిల్లా కార్యదర్శి కనకరాజుప్రసాద్ హెచ్చరించారు. దళితులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ స్థానిక లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ఉనా గ్రామంలో జరిగిన దాడి మరువకముందే ఉత్తరప్రదేశ్‌లోని లక్నో, ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో దళితులపై దాడులు జరిగాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తున్నా దళితులపై దాడులు చేయటం హేయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, దాడులు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యక్ష పోరాటలకు సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ నాయకులు టి.గోవింద్, సంగాల సంగీతరావు, పున్నయ్య, మందా రమేష్, చలసాని సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.